గార్ల: మహబూబాబాద్ జిల్లా గార్ల రైల్వేస్టేషన్ సమీపంలోని పాకాల యేరు వద్ద మణుగూరు నుంచి సికింద్రాబాద్ వెళ్లే కాకతీయ ఫాస్ట్ ప్యాసింజర్ రైలుకు పెను ప్రమాదం తప్పింది. విరిగిన రైలు పట్టాను గుర్తించి లోకో పైలెట్ రైలును నిలిపివేశాడు. దీంతో పలు రైళ్లు ఆలస్యంగా నడిచాయి. రైల్వే అధికారులు తెలిపిన ప్రకారం వివరాలిలా ఉన్నాయి.. ఉదయం ఐదు గంటల ప్రాంతంలో వరంగల్ వైపు కాకతీయ ఫాస్ట్ ప్యాసింజర్ రైలు వెళ్తుండగా పట్టాలు విరిగిన శబ్ధాన్ని గమనించిన లోకో పైలెట్ రైలును నిలిపివేశారు. అప్పటికే పలు బోగీలు విరిగిన రైలు పట్టాపై నుంచి ముందుకు వెళ్లాయి. సకాలంలో పైలెట్ రైలును నిలిపివేయడంతో పెను ప్రమాదం తప్పింది. విషయం తెలిసిన రైల్వే అధికారులు, ఇంజినీర్ల బృందం ఘటన స్థలానికి వెళ్లి మరమ్మతులు చేపట్టారు. తిరిగి ఉదయం 6.20 గంటల సమయంలో పాసింజర్ రైలు అక్కడ నుంచి కదిలింది.