‘విజేత’ ట్రైలర్‌లో కొత్తగా ఏం లేదు

Kalyaan Dhev Vijetha Movie Theatrical Trailer

మెగాస్టార్‌ చిరంజీవి చిన్నల్లుడు కళ్యాణ్‌ దేవ్‌ హీరోగా తెరకెక్కిన ‘విజేత’ చిత్రం విడుదలకు సిద్దం అయ్యింది. ఇప్పటికే ఈ సినిమా ఫస్ట్‌లుక్‌ పోస్టర్‌ మరియు టీజర్‌ రావడంతో సినిమా ఎలా ఉంటుందో ఒక క్లారిటీ వచ్చేసింది. ఒక కుర్రాడు జులాయిగా తిరుగుతుంటే అతడి తండ్రి పడ్డ కష్టం, తండ్రి అనుభవించిన క్షోభ ఎలా ఉంటుందనే విషయాలను చిత్రంలో చూపించబోతున్నట్లుగా టీజర్‌లోనే చెప్పేశారు. సినిమా కథను దాదాపుగా టీజర్‌లోనే చూపించడంతో ప్రేక్షకులు సినిమాపై ఆసక్తిని పెంచుకున్నారు. తాజాగా చిత్రం ఆడియో విడుదల కార్యక్రమం గ్రాండ్‌గా జరిగింది. ఆడియో విడుదల కార్యక్రమంలోనే సినిమా ట్రైలర్‌ను విడుదల చేయడం జరిగింది.

టీజర్‌ చూసిన తర్వాత ట్రైలర్‌ చూస్తూ ఉంటే పెద్దగా ఆసక్తిగా అనిపించడం లేదు. టీజర్‌లో ఏదైతే చూపించారో ట్రైలర్‌లో కూడా అదే చూపించారు అంటూ విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. ట్రైలర్‌ కొత్తగా ఉండి ఉంటే సినిమా స్థాయి మరింతగా పెరిగేదని, తప్పకుండా సినిమాకు ట్రైలర్‌ మంచి హెల్ప్‌ అయ్యేది అంటూ విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం సినిమాకు సంబంధించిన పోస్ట్‌ ప్రొడక్షన్‌ వర్క్‌ జరుగుతుంది. భారీ అంచనాల నడుమ రూపొందిన ఈ చిత్రంను సాయి కొర్రపటి నిర్మించగా, రాకేష్‌ శశి దర్శకత్వం వహించాడు. మాళవిక నాయర్‌ ఈ చిత్రంలో హీరోయిన్‌గా నటించింది. జులై 12న ఈ చిత్రాన్ని విడుదల చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఇప్పటికే మెగా ఫ్యామిలీ నుండి పలువురు హీరోలుగా ఎంట్రీ ఇచ్చారు. మరి ఈ చిత్రంతో మెగా హీరో కళ్యాణ్‌ సక్సెస్‌ దక్కించుకుని మెగా సక్సెస్‌ను దక్కించుకుంటాడేమో చూడాలి.