Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
50 ఏళ్ల నుంచి సినీ రంగంలో ఉంటున్నా ముక్కుసూటిగా మాట్లాడ్డం తప్ప లౌక్యం ఎరగని మనిషిగా కమల్ కి పేరుంది. ఇటీవల ఓ సభావేదిక మీదే సూపర్ స్టార్ రజని ఇదే విషయాన్ని ప్రస్తావించాడు కూడా. దేవుడిని నమ్మకపోవడం మొదలుకుని చాలా విషయాల్లో సంప్రదాయం పేరుతో నడిచే పద్ధతుల్ని కమల్ ప్రశ్నించేవాడు. ఎవరు ఏమనుకున్నా లెక్క చేయకుండా తన పద్ధతులను మార్చుకునేవాడు కాదు. ఈ క్రమంలో కొన్ని ఇబ్బందులు పడ్డాడు. విశ్వరూపం విడుదల సమయంలో ఎదురైన సమస్యలకి తాను దేశం వదిలి వెళతా అంటూ కన్నీరు కూడా పెట్టుకున్నాడు. కానీ పట్టువిడుపులు ప్రదర్శించలేదు. కానీ రాజకీయాల్లోకి ఇంకా పూర్తిగా రెండు కాళ్ళు పెట్టకముందే ఆ వాసనలు అబ్బేసినట్టుంది.
హిందూ తీవ్రవాదం అనే వ్యాఖ్యలతో కమల్ కి బీజేపీ సహా వివిధ వర్గాల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమైంది. మామూలుగా అయితే కమల్ ఈ వ్యాఖ్యల్ని సమర్ధించుకోడానికి గట్టి ప్రయత్నం చేసేవాళ్ళు. తొలుత అలాగే చేశారు కూడా. కమల్ ని కాల్చి చంపాలన్న ఓ నాయకుడి కామెంట్స్ తో కమల్ కి సినీ రంగం నుంచి మద్దతు దొరికింది. అయినా కమల్ అదే ధోరణిలో ముందుకు వెళ్ళలేదు. పుట్టినరోజు నాడు తన రాజకీయ పార్టీ గురించి ఎన్నో విషయాలు మాట్లాడిన కమల్ హాసన్ తాను చేప్పట్టే కార్యక్రమాలు హిందువుల మనోభావాల్ని దెబ్బ తీయకుండా చూసుకుంటానని చెప్పారు. కమల్ నుంచి ఈ తరహా మార్పు చూసి ఆయన సన్నిహితులే ఆశ్చర్యపోతున్నారు. రాజకీయాలు ఎవరిని అయినా ఇట్టే మార్చేస్తాయని అనుకోవడమే కాదు. కమల్ రూపంలో కళ్లారా కనపడుతుంటే ఆ నిజాన్ని జీర్ణించుకోవడం ఇప్పుడిప్పుడే అలవాటు చేసుకుంటున్నారు. కమల్ ఇకపై నటుడిగానే కాదు పక్కా రాజకీయ నేత అనిపించుకోవడం ఖాయం అనిపిస్తోంది.