Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
ఎన్నాళ్ల నుంచో కొనసాగుతున్న సస్పెన్స్ కు తెరపడింది. తమిళ ప్రముఖ నటుడు కమల్ హాసన్ రాజకీయ రంగ ప్రవేశం ఖరారయింది. అయితే అందరూ అనుకున్నట్టుగా ఏదో పార్టీలో చేరడం కాకుండా సొంతంగా పార్టీ పెట్టబోతున్నారు కమల్ హాసన్. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా ప్రకటించారు. ఈ సందర్భంగా కమల్ కొన్ని సంచలన వ్యాఖ్యలూ చేశారు. రాజకీయాల్లోకి తాను ఇష్టంగా రావట్లేదని, ప్రజల బలవంతం మేరకే వస్తున్నానని కమల్ చెప్పారు. ఇది ఇష్టపూర్వకంగా చేస్తున్న పనికాదన్నారు. తనకున్న ఐడియాలతో సరితూగే పార్టీలు తమిళనాడులో లేవని, అందుకే కొత్త పార్టీ పెడుతున్నానని కమల్ హాసన్ తెలిపారు.
బీజేపీతో తాను చేతులు కలపనున్నట్టు వచ్చిన వార్తలను ఆయన ఖండించారు. అన్నాడీఎంకె అంతర్గత వ్యవహారాలపైనా..కమల్ స్పందించారు. శశికళను పార్టీ జనరల్ సెక్రటరీ పదవి నుంచి తొలగించటం మంచి నిర్ణయమన్నారు. ఆమెను తప్పించటంతో తమిళనాడు రాజకీయాల్లో మార్పు వస్తుందన్న నమ్మకం పెరిగిందని వ్యాఖ్యానించారు. తన సినిమాల ద్వారా తమిళనాడులోనే కాక జాతీయస్థాయిలో గుర్తింపు పొందారు కమల్ హాసన్. ఇటీవల ఆయన వరుస పరాజయాలు ఎదుర్కొంటున్నారు. అయినా తమిళ ఇండస్ట్రీలో ఆయన స్థానం చెక్కుచెదరలేదు. తమిళనాడు వ్యాప్తంగా ఆయనకు విశేష సంఖ్యలో అభిమానులున్నారు. తమిళంలో మరో అగ్రహీరో రజనీకాంత్ రాజకీయ రంగం ప్రవేశం గురించి ఎన్నో ఏళ్లుగా వార్తలొస్తున్నాయి గానీ… కమల్ హాసన్ గురించి రాజకీయవర్గాల్లో చర్చ జరిగింది తక్కువ.
అయితే జయలలిత మరణం తర్వాత తమిళనాడులో ఏర్పడిన రాజకీయ అనిశ్చితి నేపథ్యంలో రజనీకాంత్, కమల్ హాసన్ లు ఇద్దరూ రాజకీయాల్లోకి రావాలని వారి అభిమానులు కోరుకుంటున్నారు. ఈ తరుణంలో కమల్ హాసన్ తరచుగా రాజకీయాలు గురించి మాట్లాడుతుండడంతో ఆయన యాక్టివ్ పాలిటిక్స్ లోకి రానున్నారని కొన్నిరోజులుగా జాతీయ స్థాయిలో ఊహాగానాలు వెలువడ్డాయి. డీఎంకె, అన్నాడీఎంకె పై కమల్ విమర్శలు చేస్తుండటం, బీజేపీని ఎక్కడా వ్యతిరేకించకపోవటంతో.. ఆయన బీజేపీలో చేరతారన్న వార్తలొచ్చాయి. కానీ చివరకు కమల్ హాసన్ సొంత పార్టీకే మొగ్గుచూపారు. అటు బీజేపీ నుంచి ఆహ్వానాలు వస్తున్నా…రజనీకాంత్ కూడా కమల్ లానే కొత్త పార్టీ పెడతారని తెలుస్తోంది. అదే జరిగితే ఇన్నాళ్లూ సినీరంగంలో ప్రత్యర్థులుగా ఉన్న కమల్, రజనీ ఇక రాజకీయ వేదికపై తలపడనున్నారు.