Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
విశ్వనటుడు కమల్ హాసన్ ఇవాళ 63వ పుట్టినరోజు జరుపుకుంటున్నారు. గతంలో కమల్ పుట్టినరోజుకు ,ఈ ఏడాది బర్త్ డేకు చాలా తేడా ఉంది. రాజకీయాల్లోకి వస్తానని విస్పష్ట ప్రకటనచేసిన తరువాత కమల్ జరుపుకుంటున్న తొలి పుట్టినరోజు ఇదే. అందుకే ఆయన ఇవాళ తన కొత్త పార్టీ వివరాలు వెల్లడిస్తారని ఎప్పటినుంచో వార్తలొస్తున్నాయి. కానీ ఆ వార్తలను కమల్ తోసిపుచ్చారు. సరైన సమయంలో తన కొత్త పార్టీ ప్రకటన ఉంటుందని ఆయన తెలిపారు. ప్రస్తుతం తాను తన బృందంతో కలిసి గ్రౌండ్ వర్క్ చేస్తున్నానని, ముందుగా తాను ప్రజాసమస్యల గురించి తెలుసుకుంటానని కమల్ చెప్పారు.
పార్టీ ప్రకటనకు ముందే ప్రజలతో అనుసంధానం అవసరమని భావిస్తున్నానన్నారు. తాను రాజకీయాల్లోకి వస్తానా…రానా అనే విషయంలో ఎలాంటి సందేహం వద్దని, తాను వచ్చేశాను అని చెప్పడానికి ఈ సమావేశమనే నిదర్శనమని కమల్ వ్యాఖ్యానించారు. పుట్టినరోజు నాడు పార్టీ వివరాలు ప్రకటించని కమల్.. మియామ్ విజిల్ అనే రాజకీయ యాప్ ను విడుదలచేశారు. ప్రజల సమస్యలు నేరుగా తెలుసుకునేందుకు ఈ యాప్ రూపొందించామని, ప్రస్తుతం ఇది టెస్టింగ్ దశలో ఉందని, 2018 జనవరి నుంచి ప్రారంభిస్తామని తెలిపారు.
రాజకీయాల కన్నా తనకు ప్రజలే ముఖ్యమన్నారు కమల్. మంచిపనులు చేసేందుకే రాజకీయాల్లోకి వస్తున్నానన్నారు. హిందూ ఉగ్రవాదం అంటూ చేసిన వ్యాఖ్యలపైనా కమల్ వివరణ ఇచ్చారు. తాను ఉగ్రవాదులు అన్న పదాన్నే అస్సలు వాడలేదని, అతివాదులు, తీవ్రవాదులు అన్న పదాలను మాత్రమే వాడానని, తన వ్యాఖ్యలను వక్రీకరించవద్దని సూచించారు. హిందువుల మనోభావాలను కించపరిచే ఉద్దేశం తనకు లేదని కమల్ తెలిపారు. తాను కూడా హిందూ కుటుంబానికి చెందినవాడినేనని, కానీ వేరే మార్గాన్ని ఎంచుకున్నానని కమల్ వివరించారు. మొత్తానికి కమల్ క్షేత్రస్థాయిలో అన్ని ఏర్పాట్లూ చేసుకున్న తర్వాతే రాజకీయాల్లోకి అడుగుపెట్టనున్నారు. పార్టీ పెట్టేలోపు…తమ భావజాలాన్ని, సిద్దాంతాలను ప్రజల్లో విస్తృతంగా చర్చకు వచ్చేలా చేసి…బలాబలాలను అంచనావేసుకోనున్నారు.