Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
రాజకీయాల్లోకి వస్తానని విస్పష్ట ప్రకటన చేసిన తరువాత విశ్వనటుడు కమల్ హాసన్ పక్కా ప్రణాళికతో ముందుకు వెళ్తున్నారు. ఓ పక్క ఆయన టీం తమిళనాడులో విస్తృత పర్యటనలు చేస్తోంటే… కమల్ హాసన్ తన భావజాలంతో కలిసే నేతలతో సమావేశాలు నిర్వహిస్తూ వారి మద్దతు పొందే ప్రయత్నంచేస్తున్నారు. ఇప్పటికే ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్, కేరళ సీఎం పినరయి విజన్ తో సమావేశమైన కమల్ తాజాగా… పశ్చిమబంగ ముఖ్యమంత్రి మమతాబెనర్జీతో భేటీ అయ్యారు. 23వ ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్ లో పాల్గొనేందుకు కోల్ కతా వచ్చిన కమల్ నేరుగా వెళ్లి మమతను కలిశారు. కమల్, మమత భేటీ రాజకీయంగా ప్రాధాన్యం సంతరించుకుంది. ఇద్దరూ బీజేపీని వ్యతిరేకించేవారే.
అటల్ బిహారీ వాజ్ పేయి ప్రధానిగా ఉన్న సమయంలో కేంద్రంలోని ఎన్డీఏ ప్రభుత్వంలో భాగస్వామిగా, బీజేపీకి మిత్రపక్షంగా ఉన్న తృణమూల్ కాంగ్రెస్… తర్వాత రోజుల్లో ఆ పార్టీకి దూరమయింది. మోడీ అధికారంలోకి వచ్చిన తరువాత మమత బీజేపీని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. సరిగ్గా చెప్పాలంటే ప్రతిపక్ష కాంగ్రెస్ కన్నా ఎక్కువగా మమత బీజేపీపై విమర్శలు గుప్పిస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న ఆధార్ అనుసంధానాన్ని వ్యతిరేకిస్తూ సుప్రీంకోర్టుకు వెళ్లి చీవాట్లు సైతం తిన్నారు మమత. ఆధార్ నే కాదు… కేంద్ర ప్రభుత్వం కీలకనిర్ణయాలన్నింటినీ ఆమె వ్యతిరేకిస్తున్నారు. పెద్ద నోట్ల రద్దు జరిగి సంవత్సరం అయిన సందర్భంగా తృణమూల్ కాంగ్రెస్, కాంగ్రెస్ తో కలిసి నిరసన ప్రదర్శనలు సైతం నిర్వహించింది.
ఇక కమల్ హాసన్ విషయానికొస్తే… రాజకీయాల్లోకి వస్తున్నానన్న ప్రకటన చేస్తూనే… నా రంగు కాషాయం కాదని… తన పంథా తెలియజేశారు కమల్. అందుకు తగ్గట్టుగా బీజేపీపైనా, ఆరెస్సెస్ పైనా తీవ్ర విమర్శలు చేస్తున్నారు. ఇటీవలే ఆయన దేశంలో హిందూ ఉగ్రవాదం పెరిగిపోతుందంటూ చేసిన వ్యాఖ్యలు తీవ్ర కలకలం సృష్టించాయి. ఇలా… బీజేపీని వ్యతిరేకించే మమత, కమల్ కోల్ కతాలో సమావేశం కావడం రాజకీయాల్లో తీవ్ర చర్చనీయాంశమయింది. కమలదళానికి వ్యతిరేకంగా కలిసి పనిచేసే అవకాశంపై చర్చించేందుకే వారిద్దరూ సమావేశమయ్యారని విశ్లేషకులు భావిస్తున్నారు.