2010 లో విడుదలై భారీ విజయం సాధించిన రోబో సినిమాకి సీక్వెల్ రోబో 2.0 దాదాపు 8 సవంత్సరాల తరువాత 2018 లో విడుదలకి సిద్ధం అవుతుంది. రోబో కి సుమారు 150 కోట్లు ఖర్చు చేయించిన దర్శకుడు శంకర్, ఈ సీక్వెల్ కి మాత్రం 500 కోట్లు పైనే ఖర్చు పెట్టిస్తున్నాడు. ఎలాగైనా బాహుబలి రికార్డులని బద్దలు కొట్టి, తమిళ సినిమా సత్తా చాటాలని కసితో తీస్తునట్లున్నాడు. ఈ సినిమా విడుదలలో ఆలస్యం అవుతుండడం తో, తమ డబ్బు వెనక్కి ఇవ్వాలని వచ్చిన ఫైనాన్సియర్లకి కొంత సినిమా ప్రివ్యూ చూపించడంతో, ముక్కున వేలేసుకొని వచ్చిన వాళ్ళు వెనక్కి వెళ్లిపోయారంట. సినిమాలో గ్రాఫిక్స్ కోసమే ఎక్కువ భాగం ఖర్చు చేయడంతో, గ్రాఫిక్స్ సన్నివేశాలన్నీ ఇదివరకు చూడని రీతిలో ప్రేక్షకులని సంభ్రమాశ్చర్యాలకు గురిచేస్తాయని చెప్పుకుంటున్నారు.
చిట్టి మరియు వశీకర్ గా రజనీకాంత్ ద్విపాత్రాభినయం చేస్తున్న ఈ చిత్రంలో అమీ జాక్సన్ హీరోయిన్ గా, బాలీవుడ్ నటుడు అక్షయ్ కుమార్ విలన్ గా నటిస్తున్నాడు. దర్శకుడు శంకర్ మొదటగా ఈ సినిమాలో విలన్ పాత్రని పోషించడానికి కొందరు హాలీవుడ్ నటులను సంప్రదించాడు. ఐ సినిమా విడుదల సమయంలో ఆర్నాల్డ్ ముఖ్య అతిధిగా విచ్చేయడంతో, ఆర్నాల్డ్ విలన్ పాత్రను పోషిస్తారని అందరూ అనుకున్నారు. కానీ, చిత్రంగా అక్షయ్ కుమార్ విలన్ గా ఈ సినిమా ప్రారంభం అవ్వడంతో ఆర్నాల్డ్ ని మన సినిమాలో సినిమాలో చూడాలనుకున్న ప్రేక్షకుల ఆశలన్నీ కల్లలే అయ్యాయి. కానీ, క్రో మాన్ లుక్ లో విడుదల చేసిన అక్షయ్ కుమార్ ఫస్ట్ లుక్స్ కి ప్రేక్షకుల నుండి మంచి స్పందన వచ్చింది.
అయితే, ఈ సినిమా గురించి మరో ఆసక్తికరమైన విషయాన్నీ దర్శకుడు శంకర్ తెలిపారు. రోబో 2.0 చేద్దామని అనుకున్న తరువాత విలన్ రోల్ కి తాను అనుకున్నది కమల్ హాసన్ అని, అతనికి కథని కూడా వివరించానని, కానీ, విలన్ పాత్ర చేయడం తనకి ఇష్టం లేదని కమల్ చెప్పడంతో తాను వేరే నటుల్ని ప్రయత్నించి, చివరగా అక్షయ్ కుమార్ ని ఎన్నుకున్నానని తెలిపారు. ఏదేమైనా కమల్ హాసన్ ని, రజినీకాంత్ ని ఒకే తెర పై చూడాలనుకున్న అభిమానులందరికి ఇది చేదు విషయమే. ఒకేవేళ ఈ సినిమా వారివురూ కలిసి చేసుంటే, ఈ సినిమా మీద ఇప్పుడున్న అంచనాలు పదింతలు పెరిగేవి అనడంలో ఎటువంటి సందేహం లేదు.
రోబో 2.0 తరువాత దర్శకుడు శంకర్ కమల్ హాసన్ తో భారతీయుడు సీక్వెల్ ని తెరకెక్కిస్తానని ప్రకటించాడు.