సూపర్ స్టార్ రజనీకాంత్ రాజకీయ రంగప్రవేశ ప్రకటనతో తమిళ నాట పొలిటికల్ స్పీడ్ పెరిగింది. అంతకు ముందు కొన్నాళ్ళు ప్రతి చిన్న విషయం మీద రాజకీయ కామెంట్స్ చేస్తూ సోషల్ మీడియాలో హల్ చెల్ చేసిన కమల్ కొన్నాళ్లుగా సైలెంట్ అయిపోయారు. రజని పొలిటికల్ ఎంట్రీ ని స్వాగతించిన కమల్ మళ్లీ పొలిటికల్ అవతారం ఎత్తడానికి రెడీ అవుతున్నారు. తమిళ వీక్లీ లో ఓ ధారావాహిక వ్యాసాలు రాస్తున్న ఆయన ఎట్టి పరిస్థితుల్లో రాజకీయాల నుంచి వెనకడుగు వేసేది లేదని తాజాగా ప్రకటించారు. రజని ప్రకటన తర్వాత కమల్ సైలెన్స్ మీద రాష్ట్రం అంతా చర్చ మొదలైంది. దీంతో కమల్ ఈ ప్రకటన చేసినట్టు తెలుస్తోంది.
కమల్ తాజా వ్యాసంలో తమిళ రాజకీయాల్లో సంచలనంగా భావిస్తున్న ఆర్కే నగర్ ఎన్నికల ఫలితాన్ని గురించి విశ్లేషించారు. అక్కడ ఓటర్లు డబ్బుకు అమ్ముడుపోయి తమ జీవితాన్ని తామే సమస్యల్లో నెట్టుకున్నారని కమల్ వ్యాఖ్యానించారు. ఈ ఓట్ల కొనుగోలుతో ఓ సారి ఎన్నికలు ఆగిపోయినా రెండోసారి కూడా పరిస్థితిలో ఏ మార్పు లేదని కమల్ ఆవేదన చెందారు. అధికార పార్టీ ఒక్కో ఓటుకి 6 వేల రూపాయలు ఇస్తే , స్వతంత్ర అభ్యర్థి ( దినకరన్ ) 20 వేలు ఇచ్చాడని కమల్ చెప్పుకొచ్చారు. ఆ 20 వేలకు అమ్ముడుబోయిన ఓటర్లు బిక్షమెత్తినట్టే అని కమల్ తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. ఇలాంటి నీచమైన సంఘటన ఇంకెక్కడైనా చూడగలమా అంటూ కమల్ ప్రశ్నించారు.
కమల్ వ్యాఖ్యలు ఒక్క తమిళనాడులోనే కాదు. దేశవ్యాప్తంగా సంచలనం రేపుతున్నాయి. ఓట్ల కొనుగోలు గురించి ఎప్పుడు వచ్చినా కేవలం ఓ పార్టీ మీద ఇంకో పార్టీ విమర్శలు చేయడమే ఇంతవరకు చూసాం. ఈసారి అందుకు భిన్నం అయిన మాటలతో కమల్ వచ్చారు. నేరుగా డబ్బు తీసుకున్న జనాన్ని కూడా ఏకిపారేశారు. సంప్రదాయ రాజకీయాల్లో ఈ త్వరహా వ్యాఖ్యలు ఎప్పుడూ వినపడవు. కానీ కమల్ ఆ సాహసం చేశారు. దీని వల్ల ఓట్లు రాలవని కమల్ కి కూడా తెలుసు. అయితే ఈ ధోరణి వల్ల ఆలోచించగలిగే వారిలో అయినా కొంత అవగాహన పెరుగుతుందని కమల్ ఆలోచనట. ఈ ఆలోచన బాగానే వున్నా చిన్న పాటి కామెంట్స్ తో ఏదీ ఒక్కసారిగా మారిపోదు. కాకుంటే కొత్త దారి పడాలంటే ఎక్కడో చోట తొలిఅడుగు పడాల్సిందే. ఆ ప్రయత్నం ,ధైర్యం చేసిన కమల్ ని అభినందించాల్సిందే.