కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ మురుగదాస్ తాజాగా తెరకెక్కించిన ‘సర్కార్’ చిత్రం వివాదంలో చిక్కుకున్న విషయం తెల్సిందే. సర్కార్ చిత్రంలోని వరలక్ష్మి పోషించిన కోమరవల్లి పాత్ర తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి జయలలితకు వ్యతిరేకంగా ఉందని, చనిపోయిన అమ్మను అవమానించే విధంగా వరలక్ష్మి పాత్ర ఉంది అంటూ అన్నాడీఎంకే కార్యకర్తలు తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు. ప్రస్తుతం అధికారంలో ఉన్న అన్నాడీఎంకే నాయకులు వెంటనే మురుగదాస్‌ను అరెస్ట్ చేయాల్సిందే అంటూ డిమాండ్ చేస్తున్నారు. ప్రభుత్వం వారి చేతిలో ఉంది కనుక మురుగ ఏ క్షణంలో అయినా అరెస్ట్ అయ్యే అవకాశం ఉందని మీడియాలో వార్తలు వస్తున్నాయి. కొన్ని మీడియా సంస్థలు మురుగదాస్‌ను అరెస్ట్ చేసినట్లుగా ప్రచారం చేస్తున్నారు.
ఇలాంటి సమయంలో కోలీవుడ్ సినీ ప్రముఖులు పలువురు మురుగదాస్‌కు బాసటగా నిలుస్తున్నారు. మొదటగా ఈ విషయమై కమల్ హాసన్ స్పందించి మురుగదాస్‌కు పూర్తి మద్దతు తెలిపాడు. అన్నాడీఎంకే కార్యకర్తలు అనవసర రాద్దాంతం చేస్తున్నారని, అన్నాడీఎంకే ప్రభుత్వం మురుగదాస్‌పై కక్ష పూరితంగా వ్యవహరిస్తున్నట్లుగా కమల్ ఆగ్రహం వ్యక్తం చేశారు. మరో వైపు నడిగర్ సంఘం అధ్యక్షుడు, నిర్మాతల మండలి సభ్యుడు అయిన విశాల్ కూడా ఈ విషయమై స్పందించాడు. మురుగదాస్‌ను అరెస్ట్ చేసినట్లుగా వస్తున్న వార్తలు నిజం కాదని చెప్పిన విశాల్, అలా జరిగితే చూస్తూ ఊరుకునేది లేదు అంటూ తేల్చి చెప్పాడు. ఇంకా పలువురు సోషల్ మీడియా ద్వారా మురుగదాస్‌కు సపోర్ట్‌గా నిలుస్తున్నారు.