Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
తమిళనాడు రాష్ట్రమంతా పర్యటించడానికి ఏర్పాట్లు చేసుకుంటున్న విలక్షణ నటుడు కమల్ హాసన్ సూపర్ స్టార్ రజనీకాంత్ తో సమావేశమయ్యారు. చెన్నైలోని తన నివాసానికి వచ్చిన కమల్ కు రజనీ సాదర స్వాగతం పలికారు. వారిద్రదూ అనేక విషయాలపై ఆయనతో చర్చించినట్టు తెలుస్తోంది. అయితే ఇది సాధారణ భేటీ అని రాజకీయాలతో సంబంధం లేదని సమావేశం అనంతరం కమల్ హాసన్ చెప్పారు. తమిళనాడులో పర్యటన ప్రారంభించనున్న విషయాన్ని రజనీతో చెప్పడానికి వచ్చానని తెలిపారు. పర్యటనకు ముందు అందరినీ ఓ సారి కలవాలనుకుంటున్నానన్నారు. ఇద్దరూ రాజకీయాల్లో పనిచేయడం అన్నదానికి కాలమే సమాధానం చెబుతుందన్నారు.
తమ భేటీపై రజనీకాంత్ కూడా స్పందించారు. డబ్బు కోసమో, పేరు కోసమో కమల్ రాజకీయాల్లోకి రావడం లేదని, కేవలం తమిళనాడు ప్రజలకు మంచిచేయాలన్న ఉద్దేశంతోనే రాజకీయాల్లోకి వచ్చారని అభిప్రాయపడ్డారు. సినిమాల్లో తనకు, కమల్ కు వేర్వేరు స్టైల్స్ ఎలా ఉన్నాయో…రాజకీయాల్లోనూ అదే వర్తిస్తుందని తెలిపారు. ప్రజలకు మంచి చేయాలన్నదే తామిద్దరి ఉద్దేశం అన్నారు. కొన్నినెలల క్రితం ప్రత్యక్ష రాజకీయాల్లోకి వస్తానని ప్రకటించిన కమల్ ఇప్పుడు కార్యాచరణ ప్రణాళిక రూపొందించుకుంటున్నారు. ఈ నెల 21న కమల్ పార్టీకి సంబంధించి కీలక ప్రకటన చేయనున్నారు. మధురైలో రాజకీయ పార్టీ ప్రకటిస్తారు. సాయంత్రం రామనాథపురం వద్ద ఉన్న ప్రదేశంలో బహిరంగ సభ ఏర్పాటుచేసి తాను రాజకీయాల్లోకి ఎందుకు రావాలనుకుంటోంది, ఏం చేయాలనుకుంటోంది వివరించనున్నారు.