Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
తమిళ రాజకీయాల్లో స్పష్టత కోసం ఎదురు చూపులు చూడాల్సిన పరిస్థితి ఇంకొంత కాలం తప్పేట్టు లేదు. సూపర్ స్టార్ రజని రాజకీయ ప్రకటనతో ఏ వర్గాలు ఎటెటు మోహరిస్తాయి అన్నదానిపై ఓ క్లారిటీ వస్తుందని అంతా భావించారు. రజని మాటల్లోనూ ఇదే భావం వ్యక్తమైంది. అయితే రజని రాజకీయ పార్టీ ప్రకటన ఇంకొంత కాలం వెనక్కి వెళ్లబోతోందట. దీనికి కారణం రాష్ట్రేతరుడని రజని మీద వస్తున్న విమర్శలు కాదట. సుదీర్ఘ కాలం పాటు వెండితెర మీద రజని చరిష్మా ని తన ప్రతిభతో ఢీకొట్టిన కమల్ ఇందుకు ముఖ్య కారకుడు. జయ మరణం తర్వాత తమిళనాట ప్రతి రాజకీయ పరిణామం మీద చురుగ్గా స్పందిస్తున్న కమల్ ఇప్పుడు పాలిటిక్స్ లో ఎంట్రీ ఇవ్వడానికి రెడీ అయిపోయారన్న సమాచారంతో రజని ఇంకొన్నాళ్ళు వేచి చూసే ఆలోచనలో ఉన్నారట.
బాలచందర్ శిష్యులుగా వెండితెర మీద కమల్, రజని వెలిగిపోయారు. ఇద్దరిలో కమల్ నటనకు ఎక్కువ మార్కులు పడ్డప్పటికీ రజని మెరుపుల ముందు నిలవడం ఎప్పటికప్పుడు సవాల్ అయ్యింది. కానీ రాజకీయాలు వేరు. ఎక్కడి నుంచో వచ్చి తమిళనాడు సినీ అభిమానుల మనస్సుల్లో చెరగని ముద్ర వేసిన రజని కి స్థానికత అంశం రాజకీయాల్లో గట్టి అడ్డుగోడగా నిలుస్తోంది. ఇదే పాయింట్ ని అస్త్రంగా మలుచుకుని రాజకీయాల్లో అయినా రజని మీద పైచేయి సాధించాలని కమల్ భావిస్తున్నారట. ఈ మేరకు ఓ సర్వే నిర్వహిస్తే ఇదే అందులోను కమల్ కి స్థానికత తమిళ రాజకీయాల్లో కలిసొస్తుందని తేలిందట. దీంతో పాలిటిక్స్ వైపు కమల్ ఓ అడుగు ముందుకు వేస్తే రజని ఓ స్టెప్ బ్యాక్ వేసినట్టు తెలుస్తోంది. అయితే ఇది రజని రాజకీయ ప్రవేశం మీద ప్రభావం చూపే తాత్కాలిక అంశం మాత్రమే.
మరిన్ని వార్తలు