కమల్ క్షమాపణ చెప్పాల్సిందే..

కర్ణాటక సంగీత ప్రపంచం అంతా కూడా భగవత్‌ స్వరూపంగా భావించి కొలిచే వాగ్గేయకారుడు త్యాగరాజు. అలాంటి వారిని విశ్వనటుడు కమల్‌ హాసన్‌ భిక్షమెత్తుకొనే వ్యక్తిగా అభివర్ణించారు. అయితే ఆయన వ్యాఖ్యలపై తీవ్ర అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. ఎన్ని కష్టాలొచ్చినా జీవితాంతం శ్రీరాముడినే స్మరించి, స్తుతించి తరించిన పరమ భక్తుడైన ఆ హరిదాసును అవమానించటంపై ఆగ్రహావేశాలు వెల్లువెత్తుతున్నాయి. తమిళనాడులోని సంగీత విద్వాంసులంతా కమల్‌పై తీవ్రంగా మండిపడుతున్నారు. కమల్ హాసన్ వెంటనే క్షమాపణ చెప్పాలని డిమాండ్‌ చేస్తున్నారు.

అదేవిధంగా నటుడు విజయ్‌సేతుపతితో ఇన్‌స్టాగ్రాంలో ఈ మధ్య లైవ్‌లో మాట్లాడిన కమల్‌.. త్యాగరాజు శ్రీరామచంద్రుడిని స్తుతిస్తూ బిచ్చమెత్తుకొనేవాడని అభ్యంతరకరంగా మాట్లాడారు. ఈ వ్యాఖ్యలపై ఆగ్రహం వ్యక్తంచేసిన గాయకుడు పాల్ఘాట్‌ రాంప్రసాద్‌.. తక్షణం కమల్‌ హాసన్ క్షమాపణ చెప్పాలని డిమాండ్‌ చేశారు. ఆయనకు వ్యతిరేకంగా ఓ పిటిషన్‌ను ప్రారంభించగా… ఇప్పటికే 19,293 మంది సంగీత విద్వాంసులు సంతకాలు చేశారు. త్యాగరాజస్వామి గొప్ప హరిదాసు అని మల్లాది సోదరుల్లో ఒకరైన మల్లాది శ్రీరామప్రసాద్‌ అన్నారు. అలాగే.. ప్రముఖ మృదంగం విద్వాంసుడు తిరువరూర్‌ భక్తవత్సలం, గాయని మహతి కూడా కమల్‌పై ఆగ్రహం వ్యక్తం చేశారు.

అంతేకాకుండా త్యాగరాజు కర్ణాటక సంగీతానికి మూలస్తంభంలాంటివారు. ఆయన సృజించిన కృతులు ఇప్పటికీ కర్ణాటక సంగీతకారులకు పాఠ్యగ్రంథంగా ఉన్నాయి. ఆయన రచనలన్నీ కూడా కోట్ల మంది సంగీత ప్రియులను భక్తిపారవశ్యంలో ఓలలాడిస్తున్నాయి. దక్షిణాదిలో పుట్టిన భక్తి ఉద్యమంలో త్యాగరాజు పాత్ర వెలకట్టలేనిది. శ్రీరాముడినే పరమ ప్రభువుగా కీర్తించిన త్యాగరాజు ఊరూరా తిరుగుతూ ప్రజలను భక్తి ఉద్యమంవైపు మళ్లించారు. అంతటి చారిత్రక పురుషున్ని అవమానించటంపై ఆవేదనలతో కూడిన ఆగ్రహం తీవ్రస్థాయిలో వ్యక్తం కావడం ఇంకా ధర్మం.. సంప్రదాయం నిలిచే ఉంది అనడానికి సాక్ష్యంగా చెప్పవచ్చు.