‘‘ఏ క్రీడలోనైనా టోర్నమెంట్లు, ఫైనల్ మ్యాచ్‌లు.. అభిమానుల్లో ఉత్సుకతను రెట్టింపు చేస్తాయి. అంతేకానీ తుది మ్యాచ్ ఫలితం ఒక్కటే ఉతృష్కమైనది కాదు. నిజం చెప్పాలంటే టీమిండియాతో పోరు చాలా కఠినం. వాళ్లు గొప్పగా ఆడతారు. వరల్డ్ టెస్టు చాంపియన్‌షిప్ ఫైనల్ గెలిచినందుకు మాకు గర్వంగా ఉంది. అయితే, ఈ ఒక్క మ్యాచ్ ఓడిపోయినంత మాత్రాన భారత జట్టు సామర్థ్యాన్ని తక్కువగా అంచనా వేయలేం. గతేడాది కాలంగా వారు ఎంతో బాగా ఆడుతున్నారు. భవిష్యత్తులో తప్పక మరిన్ని గొప్ప విజయాలు సాధిస్తారు’’ అంటూ న్యూజిలాండ్ క్రికెట్ జట్టు కెప్టెన్ కేన్ విలియమ్సన్ కోహ్లి సేనపై ప్రశంసలు కురిపించాడు.
అదే విధంగా.. భారత క్రికెటర్లు ప్రతీసారి పట్టుదలగా నిలబడి తమ సత్తా చాటుతారని, ముఖ్యంగా టీమిండియా సీమర్లు, స్పిన్నర్లు అసాధారణ ప్రతిభాపాటవాలు కనబరిచారని ప్రశంసించాడు. ఇక బ్యాట్స్‌మెన్ వరల్డ్ క్లాస్ ఆట గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదని, ప్రపంచంలోని అత్యుత్తమ ఆటగాళ్లలో వారికి స్థానం ఉంటుందని విలియమ్సన్ చెప్పుకొచ్చాడు.
కాగా డబ్ల్యూటీసీ ఫైనల్‌లో న్యూజిలాండ్ చేతిలో భారత్ 8 వికెట్ల తేడాతో ఓటమిపాలై టైటిల్‌ను చేజార్చుకున్న సంగతి తెలిసిందే. ఈ విషయంపై సోమవారం ఓ జాతీయ మీడియాతో మాట్లాడిన విలియమ్సన్.. ఒక్క పరాజయం టీమిండియా ప్రతిష్టను ఏమాత్రం మసకబార్చదని ప్రత్యర్థి జట్టును వెనకేసుకొచ్చాడు. భారత్‌లో క్రికెట్ అంటే ఓ ప్యాషన్ అని, ఓ క్రికెటర్‌గా ఈ విషయాన్ని తాను తప్పక ప్రశంసించాల్సి ఉంటుందని పేర్కొన్నాడు.