Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
నంద్యాల, కాకినాడ ఎన్నికల తరువాత ఆంధ్రప్రదేశ్ లో బీజేపీ ఒంటరి పోరాటం లేదా వైసీపీ తో పొత్తు ఆలోచన పక్కనబెడుతుందని అంతా అనుకున్నారు. అయితే అధికారంలో వున్నప్పుడు క్షేత్రస్థాయి వాస్తవాలు తలకి ఎక్కువని తేలిపోయింది. మింగమెతుకు లేకపోయినా మీసాలకి సంపంగె నూనె అన్నట్టు కాకినాడ లాంటి సిటీ లో పొత్తులో భాగంగా 9 మంది కార్పొరేటర్లు ని నిలబెట్టాల్సివస్తే ముగ్గురు అభ్యర్థుల్ని వైసీపీ నుంచి అరువు తెచ్చుకోవాల్సి వచ్చింది. ఇక అక్కడ గెలిచిన మూడు స్థానాల్లో ఇద్దరు వైసీపీ నుంచి వచ్చినవాళ్లే. వాస్తవాలు ఇంత కఠినంగా ఉంటే బీజేపీ ఆశలు మాత్రం ఊహలపల్లకీలో ఉరేగుతున్నాయి.
2019 ఎన్నికల నాటికి తెలుగు రాష్ట్రాల్లోని మొత్తం 42 లోక్ సభ స్థానాలకు బీజేపీ గట్టి పోటీ ఇవ్వాలి అనుకుంటోంది. ఒక్కో రాష్ట్రానికి ఇదే మిషన్ మీద ముగ్గురు వ్యూహకర్తల్ని ఢిల్లీ నుంచి దిగుమతి చేస్తోంది. యూపీ లో బీజేపీ ప్రభుత్వం రావడం వెనుక ఇలాంటి వ్యూహకర్తల మేజిక్ ఉందని ఆ పార్టీ భావించడమే ఇందుకు కారణం. జనాల్లో మార్పు రాకుంటే ఈ వ్యూహకర్తలు ఏమి చేయగలరో ప్రశాంత్ కిషోర్ ఎపిసోడ్ చూసాం. అయినా బీజేపీ ఆశలు బీజేపీవి.
బీజేపీ హైకమాండ్ లో ఇలాంటి ఆశలు రేపడంలో 2014 తర్వాత ఏపీ లో సమాధి అయిన కాంగ్రెస్ నుంచి బీజేపీ నేతల ప్రమేయం చాలా వుంది. అందులో ఒకరైన మాజీ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ వినుకొండ లో ఇచ్చిన ఓ ప్రకటన కామెడీగా అనిపిస్తోంది. 2019 ఎన్నికల నాటికి ఏపీ లో 40 లక్షల మంది సభ్యత్వం తీసుకుంటారని, మొత్తం 175 స్థానాల్లో పార్టీ బలంగా ఉంటుందని సెలవిచ్చారు. రాష్ట్రంలో ప్రధాన ప్రతిపక్షంగా వున్న వైసీపీ ఈ మధ్యే వైస్సార్ కుటుంబం అనే కార్యక్రమం చేపట్టింది. గెలుపు ఓటములు పక్కనబెడితే ఆ పార్టీ తలపెట్టిన కార్యక్రమంలో ఇప్పటికి 40 లక్షల మంది మాత్రమే చేరారని అంటున్నారు. ఈలెక్కన చూస్తే వైసీపీ కి సమానంగా ఏపీ లో బీజేపీ బలం వుంది అనుకోవాల్సి వస్తుంది. బీజేపీ సభ్యత్వం విషయంలో కన్నా డైలాగ్స్ చూస్తుంటే వైసీపీ కి పేరడీ గా అనిపిస్తున్నాయి. పైకి ఎన్ని చెప్పుకున్నా సభ్యత్వం లెక్కలు ఎన్ని చెప్పుకున్నా రేపు ఈవీఎం లో పోల్ అయ్యే ఓట్లు ఈ ప్రకటనల ఆర్భాటాన్ని బట్టబయలు చేయకపోవు. కన్నా లాంటి వాళ్ళ మాటలు విని లేని రెక్కలు ఊహించుకుని ఆకాశంలో ఎగురుదామని ప్రయత్నిస్తే ఏమవుతుందో బీజేపీ కాలమే చెబుతుంది.