డ్యూటీ ఎక్కేసిన కన్నా…. చంద్రబాబే మెయిన్ టార్గెట్

Kanna Lakshminarayana first day of the president he started attacking CBN

Posted [relativedate] at [relativetime time_format=”H:i”]

బీజేపీ ఏపీ అధ్యక్షుడిగా బాధ్యతలు తీసుకున్న కన్నా లక్ష్మీనారాయణ అప్పుడే డ్యూటీ మొదలు పెట్టారు. ఎప్పటి నుండో పార్టీలో ఉన్న నేతలని కాదని తనని నమ్మి హైకమాండ్ తనకి అప్పచెప్పిన బాధ్యతల్ని నెరవేర్చడానికి రంగంలోకి దిగాడు. అధ్యక్షుడు అయిన తొలి రోజు నుంచే సీఎం చంద్రబాబు పై మాటల దాడి మొదలు పెట్టేశాడు. అసలు తెలుగుదేశమే బీజేపీకి ప్రధాన శత్రువు తెలుగుదేశం అధినేత చంద్రబాబే తమ టార్గెట్ అనే రీతిన వైకాపా, జనసేన లాంటి పార్టీలను గానీ వాటి అధినేతలని గానీ పల్లెత్తు మాటలు అనకుండా తన పని మొదలు పెట్టేశాడు. హోదాకు బదులు ప్యాకేజీ ఇచ్చినా చంద్రబాబు సాధించుకోలేకపోయారని ఎద్దేవా చేసారు. హోదా కంటే ప్యాకేజీ మంచిది అన్న చంద్రబాబు అదే ప్యాకేజిని ఎందుకు తీసుకోలేదని ప్రశ్నించారు.

2019 ఎన్నికల్లో పొత్తుల విషయంపై ఇప్పుడే చెప్పలేమని, పార్టీ అధినాయకత్వం నిర్ణయం తీసుకుంటుందని చెప్పారు. ప్రతిపక్ష నేత జగన్‌, జనసేన అధినేత పవన్‌తో బీజేపీ జతకడుతోందని తప్పుడు ప్రచారం చేస్తున్నారని కన్నా ధ్వజమెత్తారు. అందరినీ ఏకం చేసి పార్టీ విజయం కోసం పాటుపడతానని కన్నా లక్ష్మీనారాయణ స్పష్టం చేశారు. ఢిల్లీలో అన్ని రాష్ట్రాల బీజేపీ అధ్యక్షుల సమావేశానికి ఏపీ నుంచి కన్నా లక్ష్మీనారాయణ, తెలంగాణ నుంచి లక్ష్మణ్ హాజరయ్యారు. హస్తిన వెళ్లి సమావేశంలో పాల్గొన్న కన్నా లక్ష్మీనారాయణకు హైకమాండ్ భరోసా ఇచ్చినట్టు ప్రచారం జరుగుతోంది. సిఎం చంద్రబాబు విషయంలో ఎక్కడా వెనక్కు తగ్గవద్దని, త్వరలోనే పలు కీలక నిర్ణయాలు ఉంటాయని.. ప్రముఖులు పార్టీలో చేరతారని… అన్నింటికి సిద్దంగా ఉండాలనే సంకేతాలు వచ్చినట్టు ప్రచారం సాగుతోంది. ఇక రాజు తలుచుకుంటే దెబ్బలకి కొదువా అన్నట్టు బాబు మీద చెలరేగిపోతున్నారు ఏపీ బీజేపీ అధ్యక్ష్యులు కన్నా లక్ష్మినారాయణ.