నవరత్నాల పేరుతో చాక్లెట్ ఇచ్చి నెక్లస్ ఎత్తుకుపోతున్నారని వైసీపీపై ఏపీ బీజేపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ మండిపడ్డారు. నకిలీ బ్రాండ్‌లతో మద్యం మీద విపరీతం దోపిడి చేస్తున్నారని ఆరోపించారు. స్దానిక సంస్థల ఎన్నికలకు అందరూ సిద్ధం కావాలని… జనసేన పొత్తుతో కలసి స్థానిక ఎన్నికలలో పోటీ చేస్తున్నామని ఆయన వివరించారు. పురంధేశ్వరి అధ్యక్షతన స్దానిక ఎన్నికలకు కమిటీ ఏర్పాటు జరుగుతుందని కన్నా వివరించారు. గత ప్రభుత్వం చేసిన వాటి కంటే అదనంగా ఈ ప్రభుత్వంలో ఫ్యాక్షనిజం కూడా తోడైందని విమర్శించారు. అధికారంలోకి వచ్చిన 9 నెలల్లోనే ప్రజలపై మోయలేని భారం మోపారని మండిపడ్డారు.
రాజధానితో పాటు అన్నీ ప్రజా వ్యతిరేక విధానాలే అవలంభిస్తున్నారని కన్నా వ్యాఖ్యానించారు. రెండు ప్రాంతీయ పార్టీలు ప్రజల నమ్మకాన్ని పోగొట్టుకున్నాయని అన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో ఈ విషయాలు ప్రజలకు వివరించాలని సూచించారు. గ్రామాల్లో జరిగే అభివృద్ధి అంతా కేంద్రం ఇచ్చిన నిధుల వల్లే జరుగుతోందని అన్నారు. భయబ్రాంతులకు గురి చేసే ఎన్నికల్లో గెలిచేందుకు వైసీపీ ప్రయత్నాలు చేస్తోందని ఆరోపించారు. జగన్ పాలనపై ఆయనకే నమ్మకం లేదని… విషపూరిత జీవోల నుంచి జాగ్రత్తగా పని చేయాల్సిన అవసరం ఉందని అన్నారు.