Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
కర్ణాటకలో ఎన్నికలు దగ్గరయ్యే కొద్దీ ఎలక్షన్ హీట్ పెరుగుతోంది. బీజేపీ, కాంగ్రెస్ నేతలు మధ్య మాటల యుద్ధం భీకరంగా సాగుతోంది. బీజేపీ రధసారధి అమిత్ కర్నాటక లోనే ఉండి ఎన్నికల ప్రచారం కానిస్తున్నారు. అయితే రొజూ కాంగ్రెస్ వారి మీద నోరు పారేసుకుంటే ఏమొస్తుంది అనుకున్నారో ఏమో అందుకే ఈ సారి సొంత పార్టీ నేత మీదే రాళ్ల దాడి చేశారు. బళ్లారితో పాటు ఉత్తర కర్ణాటకలో బలమైన నాయకుడిగా పేరు ఉన్న గాలి జనార్ధన్ రెడ్డి ప్రధాన అనుచరుడు, బళ్లారి బీజేపీ ఎంపీ బి. శ్రీరాములు మీద రాళ్ల దాడి ఇప్పుడు కర్నాటక వ్యాప్తంగా చర్చనీయాంశమైంది.
వివరాలలోకి వెళితే చిత్రదుర్గ జిల్లాలోని మాళకాల్మూరు శాసన సభ నియోజక వర్గం నుంచి పోటీ చెయ్యాలని బళ్లారి బీజేపీ ఎంపీ శ్రీరాములుకు బీజేపీ అధిష్టానం సూచించింది. తన సొంత సామాజిక వర్గామయిన వాల్మీకీ ఓటర్లు ఎక్కువగా ఉన్న నియోజక వర్గం కేటాయించడంలో ఎంపీ శ్రీరాములు ఆ నియోజక వర్గం నుంచి పోటీ చెయ్యడానికి సిద్దం అయ్యారు. నాయకనహెట్టిలోని ప్రసిద్ది చెందిన స్థానిక దేవాలయంలో పూజలు చేసి ప్రచారానికి శ్రీకారం చుట్టాలని బళ్లారి ఎంపీ శ్రీరాములు ప్రయత్నించారు ఇక్కడే ఆయనకీ ఊహించని ఎదురుదెబ్బ తగిలింది.
వందలాధి మంది ఒక్కసారిగా మా నియోజక వర్గంలో మీరు పోటీ చెయ్యరాదని చీపుర్లు చూపించి ఎదురుతిరగి కారు మీద చెప్పులు విసరడంతో బీజేపీ ఎంపీ శ్రీరాములు ఒక్కసారిగా షాక్ కు గురైనారు. మాళకాల్మూరు నియోజక వర్గం సిట్టింగ్ ఎమ్మెల్యే ఎస్. తిప్పేస్వామి అనుచరులు, అభిమానులు శ్రీరాములును దేవాలయంలోకి వెళ్లకుండా అడ్డుకున్నారు. మా సిట్టింగ్ ఎమ్మెల్యే ని కాదని మీరెలా ఇక్కడ పోటీ చేస్తారు అని చీపర్లు, చెప్పులు చూపిస్తూ శ్రీరాములు గో బ్యాక్ అంటూ పెద్దఎత్తున నినాదాలు చేశారు.
వందలాధి మంది మహిళలు ఒక్కసారిగా చీపుర్లు, చెప్పులతో శ్రీరాములుకు వ్యతిరేకంగా ఎదురుతిరగడంతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. కొంత మంది సహనం కోల్పోయి శ్రీరాములు కారు మీద చెప్పులు విసరడంతో పరిస్థితి అదుపుతప్పింది. శ్రీరాములు మద్దతుదారులు కూడా పెద్ద ఎత్తున గుమికూడటంతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఆ సమయంలో ఆందోళనకారులను చెదరకొట్టడానికి పోలీసులు లాఠీచార్జ్ చేశారు. పరిస్థితి అదుపులోకి వచ్చిన తరువాత ప్రచారం చెయ్యవచ్చని భావించిన బీజేపీ ఎంపీ శ్రీరాములు అక్కడి నుంచి వెళ్లిపోయారు.
బీజేపీ గెలిస్తే శ్రీరాములుకు ఉప ముఖ్యమంత్రి పదవి ఇవ్వాలని ఆ పార్టీ భావిస్తున్నట్లు సమాచారం. దళితులకు కాంగ్రెస్ కీలక పదవులు ఇవ్వకపోవడంతో దళితులు కాంగ్రెస్ పార్టీ మీద అసంతృప్తితో ఉన్నారు. రిజర్వేషన్ల వర్గీకరణకు కాంగ్రెస్ అంగీకరించకపోవడం పై కాంగ్రెస్ అంటేనే మాదిగలు మండిపడుతున్నారు. ఈ నేపథ్యంలో అటు దళితులను, ఇటు గాలి వర్గాన్ని సంతృప్తి పరిచేందుకు బీజేపీ వ్యూహాత్మకంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.