ఈమద్య కాలంలో తెలుగులో బయోపిక్‌ల సంఖ్య పెరిగి పోతుంది. ఇటీవలే సావిత్రి జీవిత చరిత్ర ఆధారంగా తెరకెక్కిన ‘మహానటి’ ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఆ చిత్రం తర్వాత నందమూరి తారక రామారావు జీవిత చరిత్ర, ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవిత చరిత్ర, గోపీచంద్ పుల్లెల జీవిత చరిత్ర, కత్తి కాంతారావు జీవిత చరిత్ర, రాజశేఖర్ రెడ్డి జీవిత చరిత్రల ఆధారంగా సినిమాలను తెరకెక్కించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఈ బయోపిక్‌లు అన్ని కూడా వచ్చే ఏడాది ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాయి. వీటితో పాటు మరో బయోపిక్ కూడా లిస్ట్‌లో చేరింది. అదే వరంగల్ జిల్లాకు చెందిన ఎమ్మెల్సీ కొండ మురళి బయోపిక్.
తెలంగాణ జిల్లాల్లో కొండ ఫ్యామిలీ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. రాజశేఖర్ రెడ్డి సీఎంగా ఉన్న సమయంలో వీరి హవా బాగా సాగింది. కొండ సురేఖ మంత్రిగా కూడా పని చేశారు. జగన్‌కు బాసటగా నిలిచి సీఎం అవ్వాలని కోరుకున్న నేతలు వీరు. ప్రస్తుతం టీఆర్‌ఎస్‌లో పెద్దగా ప్రాముఖ్యత లేని నేతలుగా ఉన్న వీరిద్దరు మళ్లీ కాంగ్రెస్‌లోకి వెళ్లాలనే ప్రయత్నాలు చేస్తున్నారు. ఇక కొండ మురళి రౌడీ షీటర్ అనే విషయం తెల్సిందే. ఇప్పటి కూడా ఆయన పాత పద్దతిని వదిలి పెట్టలేదు అంటూ విమర్శలు వ్యక్తం అవుతూ ఉంటాయి. ఇక సురేఖ కూడా తన భర్తకు అన్ని విషయాల్లో మద్దతుగా నిలుస్తూ ముందుకు వెళ్తుంది. ఇలాంటి వారి జీవిత చరిత్రకు రంగం సిద్దం అయ్యింది. ఒక కన్నడ దర్శకురాలు ఈ బయోపిక్‌కు దర్శకత్వం వహించే అవకాశం కనిపిస్తుంది. త్వరలోనే ఈ బయోపిక్‌కు సంబంధించిన పూర్తి వివరాలు వెళ్లడయ్యే అవకాశం ఉంది.