Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
భారత క్రికెట్ తాజా సంచలనం హార్దిక్ పాండ్యాను అందరూ క్రికెట్ దిగ్గజం కపిల్ దేవ్ తో పోలుస్తున్నారు. అంతకుముందు బౌలర్ గానే సత్తా చాటిన పాండ్యా ఆస్ట్రేలియాతో వన్డే సిరీస్ లో బ్యాట్ తోనూ మెరుపులు మెరిపిస్తున్నాడు. ఆసీస్ పై సాధించిన మూడు విజయాల్లో పాండ్య కీలక పాత్ర పోషించాడు. దీంతో అందరూ పాండ్యాను కపిల్ దేవ్ తర్వాత భారత్ కు దొరికిన ఆల్ రౌండర్ అంటూ ప్రశంసిస్తున్నారు. దీనిపై కపిల్ దేవ్ స్పందించాడు. హార్దిక్ పాండ్యా ను అంతా తన వారసుడిగా భావిస్తున్నారని, అయితే పాండ్యా తనకన్నా ప్రతిభావంతుడని కపిల్ దేవ్ అన్నాడు. తనకున్న సామర్థ్యంతో, ప్రతిభతో పాండ్యా భవిష్యత్తులో జట్టులో మరింత కీలకంగా మారతాడని కపిల్ అభిప్రాయపడ్డాడు. పాండ్యా ఎంతో సాధిస్తాడని, ఎన్నో ఘనతలు సొంతం చేసుకుంటాడని, అందులో ఎలాంటి అనుమానమూ లేదని విశ్వాసం వ్యక్తంచేశాడు కపిల్. ఇందుకోసం చేయాల్సింది ఒక్కటేనని..మరింత కష్టపడాలని పాండ్యాకు సూచించాడు. 1983లో తన ఆల్ రౌండ్ ప్రతిభతో భారత్ కు ప్రపంచ కప్ సాధించి పెట్టాడు కపిల్ దేవ్. టోర్నీ తొలిదశ నుంచే నిష్క్రమించే స్థితికి చేరిన భారత్ ను జింబాబ్వేతో మ్యాచ్ లో తన అసాధారణ బ్యాటింగ్ తో గట్టెక్కించాడు కపిల్.
ఆ తర్వాత వరుస విజయాలతో ఫైనల్ కు చేరింది టీమిండియా…అప్పట్లో భీకర ఫామ్ తో ఉన్న వెస్టెండీస్ తో ఫైనల్ అనగానే…అందరూ…కప్పు ఆ దేశానికే అనుకున్నారు. వరుసగా మూడోసారీ ఆ దేశమే ప్రపంచకప్ గెలుచుకుంటుందని భావించారు. కానీ ఫైనల్లో వారి అంచనాలు పటాపంచలు అయ్యాయి. లార్డ్స్ లో లో జరిగిన ఫైనల్ మ్యాచ్ లో వెనక్కి పరిగెత్తుతూ వి.వి. రిచర్డ్స్ క్యాచ్ పట్టుకున్న కపిల్ వెస్టెండీస్ తలరాతను మార్చేశాడు. కపిల్ సేన సాధించిన ప్రపంచకప్ భారతదేశంలో క్రికెట్ గతినీ మార్చివేసింది. ఆ విజయం తర్వాతే భారత్ లో క్రికెట్ శరవేగంగా విస్తరించింది. అలా దేశ క్రికెట్ చరిత్రలో కపిల్ దేవ్ ది చెరగని స్థానం. 1983 వరల్డ్ కప్ తర్వాత కొన్నేళ్లకు కపిల్ దేవ్ రిటైర్మెంట్ ప్రకటించినా…ఇప్పటికీ క్రికెట్ అభిమానులు ఆయన్ను మర్చిపోలేదు. కామెంటేటర్ గానో, కోచ్ గానో, సెలక్షన్ కమిటీలోనో ఇలా..క్రికెట్ కు సంబంధించిన దేంట్లోనూ కపిల్ లేకపోయినప్పటికీ క్రికెట్ ఆడిన రోజుల్లో చూపిన ప్రతిభతోనే అభిమానులకు గుర్తుండిపోయారు. అలాగే ఇప్పుడు హార్దిక్ పాండ్యా కపిల్ దేవ్ స్థాయికి చేరుకోవాలని అందరూ ఆకాంక్షిస్తున్నారు.