Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
ప్రకాశం జిల్లా టీడీపీ రాజకీయాలు సరికొత్త మలుపు తిరుగుతున్నాయి. ఇన్నాళ్లు అద్దంకి లో గొట్టిపాటి, బలరాం వర్గాల మధ్య సాగిన పోరుకి బ్రేక్ పడేట్టు వుంది. అయితే అది సామరస్యపూర్వకంగా కుదిరే ఒప్పందం మాత్రం కాదు. కనిగిరిలో నిన్న జరిగిన టీడీపీ అంతర్గత సమన్వయ కమిటి సమావేశంలో సీనియర్ నాయకుడు బలరాం మనసు విప్పి మాట్లాడారు. ఇన్నాళ్లు అద్దంకిలో ఎమ్మెల్యే గొట్టిపాటి రవికుమార్ వర్గంతో గొడవపడటం , అటు అధిష్టానం వార్నింగ్ ఇవ్వడంతో సర్దుకుపోవడం తో గడిపేసిన బలరాం ఇక ముసుగులో గుద్దులాట తగదనుకున్నారు. అందుకే ఎప్పుడూ ఏ పరిస్థితుల్లో వాడని మాటని కనిగిరి సమావేశంలో మంత్రులు పరిటాల సునీత, సిద్దా రాఘవరావు సాక్షిగా వాడేశారు.
” 30 ఏళ్లుగా పార్టీ జెండా మోసిన వారిని పక్కనబెట్టి ఎప్పుడూ పార్టీకి ఓటు వేయని వారికి ఫించన్, ఇతర ప్రభుత్వ పథకాల్లో పెద్ద పీట వేస్తుంటే చూస్తూ భరించడం నా వల్ల కాదు. పార్టీ లో వుండమంటారో, వెళ్లిపొమ్మంటారో చెప్పేయండి. నేను దేనికైనా సిద్ధం”…అని బలరాం కనిగిరి సమావేశంలో అనడంతో కాస్త గంభీర వాతావరణం నెలకొందట. అయితే సునీత, రాఘవరావు ఆయన్ని వారించారట. చంద్రబాబు తో మాట్లాడదాం అని వారు చెప్పడంతో ఎప్పుడో కూడా తెలియజేయమని బలరాం ఒత్తిడి చేయడంతో ఆగష్టు 1 న కలుద్దామని మంత్రులు హామీ ఇవ్వడంతో అప్పటికి ఆ ఎపిసోడ్ కి ఫుల్ స్టాప్ పడిందట.
గొట్టిపాటి రవికుమార్ వైసీపీ నుంచి టీడీపీ లోకి వచ్చాక తన అసహనాన్ని బలరాం ఏ సందర్భంలోను దాచుకోలేదు. అయితే ఎప్పుడూ తనంతట తాను పార్టీ వదిలే మాట గురించి మాట్లాడలేదు. ఈసారి బలరాం ఆ మాట వాడడంతో పార్టీ నుంచి వెళ్ళిపోడానికి సిద్ధమైనట్టు భావిస్తున్నారు. అటు రవి వర్గం మాత్రం జగన్ తో కలవడానికి సిద్దమైన బలరాం కావాలనే ప్రతిసారి రాద్ధాంతం చేసి పార్టీ ని నష్టపరుస్తున్నారని అంటున్నారు. ఈ గొడవలతో పార్టీ అధిష్టానం వేటు వేస్తే సానుభూతి వస్తుంది అనుకుంటున్నారని, అయితే అది ఫలించకపోవడంతో ఇప్పుడు ఇలా మాట్లాడుతున్నారని రవి వర్గం వాదిస్తోంది. వీటిలో ఏది నిజం అయినప్పటికీ ప్రకాశం జిల్లా రాజకీయాల్లో సంచలనమే అవుతుంది.
మరిన్ని వార్తలు