స్మశానంలో పెళ్ళిరోజు వేడుకలు ఎందుకంటే ?

Karnataka Couple celebrates 18 wedding anniversary in graveyard
పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లు టీడీపీ ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు ఈమధ్యే శ్మశానంలో నిద్రించి వార్తలలోకి ఎక్కినా ఘటన మరువక ముందే అలాంటిదే ఒక ఘటన కర్ణాటకలో చోటుచేసుకుంది. దయ్యాల్లేవు, భూతాల్లేవు, అదంతా ఒట్టి రూమర్ అని నిరూపించడానికి ఓ జంట తమ పెళ్ళిరోజును శ్మశానంలో జరుపుకుని స్థానికులను ఆశ్చర్యానికి గురి చేశారు. వివరాల్లోకి వెళ్తే కర్నాటకలోని కల్‌బుర్గి జిల్లాలో మూఢ నమ్మకాలను దూరం చేసేందుకు ఒక వృద్ద దంపతులు వినూత్న ప్రయోగం చేశారు. వీరు తమ 18 వ వివాహ వార్షికోత్సవ వేడుకలను శ్మశానంలో చేసుకున్నారు. కల్‌బుర్గి‌లోని శివారు గ్రామమైన నందీకుర్‌కు చెందిన పవన్ కుమార్, అనిత‌ల విచిత్ర వివాహ వార్షికోత్సవానికి బంధువులు, స్నేహితులు హాజరయ్యారు. ఈ వేడుకలకు గుర్తుగా వారు మొక్కలను కూడా నాటారు.
అనిత పంచాయతీ అధ్యక్షురాలిగా పనిచేయగా ఆమె భర్త వవన్ కుమార్ సామాజిక కార్యకర్త. వీరు తమ ఖాళీ సమయాల్లో ప్రజల్లో నాటుకుపోయిన మూఢనమ్మకాలను తొలగించేందుకు ప్రయత్నిస్తుంటారు. ఈ నేపధ్యంలోనే వీరు శ్మశానాన్ని శుభ్రపరిచి అక్కడ వివాహ వార్షికోత్సవ వేడుకలు నిర్వహించుకున్నారు. ముందుగా శ్మశానంలో వున్న పిచ్చి మొక్కలను పీకేశారు. పేరుకున్న చెత్తాచెదారాన్నంతా తొలగించారు. ఆపై మొక్కలు నాటారు. తమ బంధువులను, గ్రామస్తులను శ్మశానానికే ఆహ్వానించారు. వారందరి సమక్షంలో దండలు మార్చుకున్నారు. అందరూ అవాక్కవుతూనే వారిని అక్షింతలు వేసి దీవించారు. వచ్చినవాళ్ళందరికీ స్వీట్లు కూడా పంచారు. ఈ సందర్భంగా 30 మంది రక్తదానం కూడా చేశారని శాతానిక మీడియా పేర్కొంది.