ఇంకా తేలని కన్నడ సంక్షోభం…15దాకా తప్పదా ?

karnataka mlas resignation

కర్ణాటక రాజకీయాల్లో పెనుదుమారం రేపిన సంక్షోభం ఇప్పట్లో సమసిపోయేట్టు కనిపించడంలేదు. ఎవరికివారు సమస్య పరిష్కారం అవుతుందని ధీమాగా చెబుతున్నా పరిస్థితులు మాత్రం అందుకు భిన్నంగా ఉన్నాయి. తాజాగా, కర్ణాటక విధానసభ స్పీకర్ ను కలసిన కాంగ్రెస్ నేతలు రాజీనామాలు సమర్పించిన అసంతృప్త ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలని విజ్ఞప్తి చేశారు.  పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు దినేశ్ గుండూరావ్ ఆధ్వర్యంలో స్పీకర్ ను కలిసిన నేతలు రామలింగారెడ్డిని మినహాయించి మిగతావారిని అనర్హులుగా ప్రకటించాలని కోరారు. విధాన సౌధలో కాంగ్రెస్ శాసనసభాపక్షం సమావేశం కాగా, రామలింగారెడ్డి కుమార్తె సౌమ్యారెడ్డి హాజరయ్యారు. కాగా, కాంగ్రెస్ నేతల విజ్ఞప్తిపై ఈ నెల 11న సమీక్ష జరపనున్నట్టు స్పీకర్ తెలియజేశారు. రాజీనామాలు సమర్పించిన 13 మందిలో 8 మంది రాజీనామాలు సక్రమంగా లేవని ఆయన క్లారిటీ ఇచ్చారు. దీంతో రాజీనామా చేసిన ఎమ్మెల్యేలంతా తన ఎదుట హాజరైన తర్వాతే నిర్ణయం ప్రకటిస్తానని వెల్లడించారు.  ప్రతాప్ గౌడ, నారాయణగౌడ, ఆనంద్ సింగ్ లను ఈ నెల 12న తన ఎదుట హాజరుకావాలని స్పీకర్ ఆదేశాలు పంపారు. రామలింగారెడ్డికి మాత్రం ఈ నెల 15న హాజరుకావాలంటూ తెలిపారు.