ప్రియురాలి మీద అనుమానం….గొంతు కోసి చంపబోయిన ప్రేమోన్మాది

suspicion on lover
హైదరాబాద్‌లో దారుణ ఘటన చోటుచేసుకుంది. దిల్‌సుఖ్‌నగర్‌ సమీపంలోని చైతన్యపురి పోలీస్‌ స్టేషన్‌ పరిధి బృందావన్‌ లాడ్జిలో యువతిపై ఉన్మాది హత్యాయత్నానికి తెగబడ్డాడు. ప్రియురాలి గొంతు కోసి ఆపై ప్రియుడూ చేయి కోసుకున్న ఘటన తీవ్ర కలకలం సృష్టించింది. ఈ ఘటనకు సంబంధించి పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం నెల్లూరు జిల్లాకు చెందిన వెంకటేశ్‌ (22)కు, హైదరాబాద్ బడంగ్‌పేటకు చెందిన మనస్విని(22)తో దిల్‌సుఖ్‌నగర్‌లో పరిచయం ఏర్పడింది. చైతన్యపురిలోని ఓ బ్యాంక్‌ కోచింగ్‌ ఇన్‌స్టిట్యూట్‌లో శిక్షణ తీసుకుంటున్న వీరి మధ్య ప్రేమ చిగురించింది. అయితే కొంత కాలంగా ఆ యువతి వెంకటేశ్‌ పద్ధతి నచ్చక దూరం పెడుతూ వచ్చింది. తనను దూరం పెట్టడమే కాక మరో ఇద్దరితో ఆమె క్లోజ్ గా ఉన్నట్టు భావించిన వెంకటేశ్  మనస్వినిపై కక్ష పెంచుకున్నాడు. ఈ క్రమంలో పక్కా ప్రణాళికతో ఆమెపై దాడి చేసినట్లు తెలుస్తోంది. వెంకటేశ్ సోమవారం రాత్రి చైతన్యపురిలోని బృందావన్‌ లాడ్జిలో ఓ గదిని ఆన్‌లైన్‌ ద్వారా బుక్ చేసుకున్నాడు. మంగళవారం ఉదయం మనస్విని (22)కి ఫోన్‌ చేసిన వెంకటేశ్.. మాట్లాడాల్సి ఉందని, కలవాలని కోరాడు. ఉదయం 10 గంటల సమయంలో వారిద్దరూ కలిసి లాడ్జి వద్దకు చేరుకున్నారు. అక్కడికి చేరుకున్న తర్వాత 501 నంబర్ గదే కావాలని లాడ్జి సిబ్బందితో వెంకటేశ్ కాసేపు వాదించాడు. చివరికి అదే గదిని అద్దెకు తీసుకున్నాడు. తన స్నేహితురాలితో కలిసి వచ్చినట్టు లాడ్జి రికార్డులో పేర్కొన్నాడు. అనంతరం మనస్విని ఆ గదికి తీసుకువెళ్లాడు. గదిలోకి వెళ్లిన తర్వాత వారిద్దరి మధ్య ఘర్షణ ప్రారంభమైనట్లు తెలుస్తోంది. మధ్యాహ్నం 12 గంటల సమయంలో ఆ గది నుంచి కేకలు వినబడటంతో ఫ్లోర్‌బాయ్‌ అప్రమత్తమై 501 గది డోర్ తెరిచేందుకు ప్రయత్నించాడు. లోపల నుంచి గడియ పెట్టి ఉండటంతో లాడ్జి సిబ్బంది తలుపులు విరగ్గొట్టారు. లోపలి లోపలికి వెళ్లి చూడగా.. మనస్విని రక్తపు మడుగులో పడి ఉంది. దీంతో ఆమెను వెంటనే ఓమ్నీ ఆస్పత్రికి తరలించారు. .అయితే అప్పటికే వెంకటేశ్‌తో ముప్పు ఉందని గ్రహించిన మనస్విని తన తండ్రికి లొకేషన్ షేర్ చేసింది. తల్లిదండ్రులు చేరుకునే సరికే వెంకటేశ్ కత్తితో ఆమె గొంతు కోశాడు. పారిపోవడానికి ప్రయత్నిస్తున్న సమయంలో తల్లిదండ్రులు, పోలీసులు అక్కడికి చేరుకున్నారు. దీంతో భయాందోళనకు గురై బాత్రూంలోకి వెళ్లి అదే కత్తితో చేయి కోసుకున్నాడు. తీవ్రంగా గాయపడిన అతడిని ఉస్మానియా ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.