Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
న్యూఇయర్ వేడుకల్లో సినీ తారలు ముఖ్యంగా హీరోయిన్లు సందడి చేయడం మామూలే. దేశవ్యాప్తంగా జరిగే వేడుకల్లో బాలీవుడ్ హీరోయిన్లతో పాటు స్థానిక భాషా హీరోయిన్లు కూడా తమ డ్యాన్సులతో కనువిందు చేస్తారు. అలా బెంగళూరులోని వైట్ ఆర్చిడ్ హోటల్ లో జరిగే నూతన సంవత్సర వేడుకలకు బాలీవుడ్ హీరోయిన్ సన్నీలియోని హాజరు కానుండడం ఆందోళనలకు దారితీసింది. సన్నీని వ్యతిరేకిస్తూ కర్నాటక రక్షణవేదిక యువసేన సంఘం నిరసనలు చేపట్టింది. మాన్యతా టెక్ పార్క్ ఎదుట జరిగిన ఆందోళనలో భాగంగా సన్నీలియోని ఫొటోలకు నిప్పంటించారు. సన్నీలియోనీ న్యూఇయర్ వేడుకల్లో పాల్గొంటే డిసెంబరు 31న యువసేన సంఘం కార్యకర్తలు సామూహిక ఆత్మహత్యకు పాల్పడతామని సంఘం రాష్ట్ర అధ్యక్షుడు హరీష్ హెచ్చరించారు. సన్నీ పొట్టి దుస్తులు ధరించడాన్ని తాము వ్యతిరేకిస్తున్నామని, ఆమె చీర కట్టుకుని కార్యక్రమానికి వస్తే అభ్యంతరం లేదని ఆయన వ్యాఖ్యానించారు.
సన్నీ గతం బాగోలేదని, ఇలాంటి వారిని తాము ప్రోత్సహించబోమని చెప్పారు. ఈ వివాదంపై కార్యక్రమ నిర్వాహకుడు స్పందించారు. ఇది ఓ కుటుంబ వేడుకలాంటిదని, ఒక కన్నడపాటకు సన్నీ డ్యాన్స్ చేస్తారని చెప్పారు. బెంగళూరుకు చెందిన తాను ఇక్కడి సంస్కృతికి తగ్గట్టే కార్యక్రమాన్ని ఏర్పాటుచేస్తున్నానని, సన్నీకి దీనికంటే పెద్ద ఆఫర్లు వచ్చినా వాటిని కాదని, బెంగళూరు రావడానికి ఒప్పుకున్నారని, ఆమెకు బెంగళూరు, హైదరాబాద్ అంటే ప్రత్యేక ఇష్టం ఉండడమే దీనికి కారణమని ఆయన తెలిపారు. ఆందోళనకారులు ఏం కోరుకుంటున్నారో, ఎందుకు ఇలా చేస్తున్నారో తెలియడం లేదని, ఇది ఓ కుటుంబ వేడుకని, దీని వల్ల రాష్ట్ర సంస్కృతికి ఎలాంటి అవమానం జరగదని ఆయన హామీఇచ్చారు. అటు ఈ ఆందోళనల నేపథ్యంలో సన్నీలియోన్ ప్రదర్శనను రద్దుచేయాలని బెంగళూరు పోలీసులు ఆదేశించారు.