Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
పద్మావత్ రిలీజ్ డేట్ ప్రకటించిన నేపథ్యంలో రాజ్ పుత్ కర్ణిసేన మళ్లీ ఆందోళనలకు సిద్దమవుతోంది. పద్మావత్ విడుదలను వ్యతిరేకిస్తూ చిత్తోర్ గఢ్ వేదికగా మరో ఉద్యమానికి పెద్ద ఎత్తున ప్రయత్నాలు ప్రారంభించింది. ఈ నెల 17వ తేదీన దేశవ్యాప్తంగా కర్ణిసేన పెద్దలు నిరసన ప్రదర్శనలకు పిలుపునిచ్చారు. అటు పద్మావత్ లో మార్పులు చేయాలన్న సెన్సార్ బోర్డు సూచనలతో దర్శకుడు సంజయ్ లీలా భన్సాలీకి కొత్త చిక్కులు వచ్చిపడ్డాయి. చిత్రానికే ప్రతిష్టాత్మకంగా భావించిన ఘూమర్ పాటను కూడా ఎడిట్ చేయాలని సెన్సార్ బోర్డు సూచించడంతో భన్సాలీకి ఏం చేయాలో అర్ధం కాని పరిస్థితి ఏర్పడింది.
నిజానికి ఘూమర్ సాంగ్ కు యూట్యూబ్ లో రికార్డు స్థాయిలో వ్యూస్ వచ్చాయి. ఆ పాటలో దీపిక చేసిన ఘూమర్ నృత్యంపై ప్రశంసల వర్షం కురిసింది. అయితే రాజ్ పుత్ కర్ణిసేన మాత్రం ఆ పాటపై తీవ్ర అభ్యంతరం వ్యక్తంచేసింది. రాణి పద్మావతి అలా గంతులేయడం ఏమిటని మండిపడింది. ఈ విషయాన్ని పరిగణనలోకి తీసుకున్న సెన్సార్ బోర్డ్ ప్యానెల్ సభ్యులు ఆ పాటను కూడా ఎడిట్ చేయాలని కోరారు. ముఖ్యంగా పాటలో దీపిక నడుము కనిపించే షాట్లను తొలగించాలని సూచించారు. అయితే అది మొత్తం పాటపై ప్రభావం చూపే అవకాశం ఉండడంతో భన్సాలీ ఓ నిర్ణయానికి వచ్చాడు. కంప్యూటర్ గ్రాఫిక్స్ ద్వారా దీపిక నడుమును కప్పిపుచ్చే యత్నం చేస్తున్నాడు. అటు ఈ ఎడిటింగ్ పనుల వల్ల జనవరి 25న పద్మావత్ విడుదలయ్యే అవకాశం కనిపించడం లేదని బాలీవుడ్ మీడియాలో వార్తలొస్తున్నాయి.