Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
ఎన్నికలు దగ్గర పడడంతో తెలుగు రాష్ట్రాలలో ఎలక్షన్ హీట్ కనిపిస్తోంది. ఎన్నికలు దగ్గరవడంతో ఏపీలో రాజకీయ పార్టీల నాయకులు, కార్యకర్తలు కప్పదాట్లు చేస్తున్నారు. ప్రతిపక్ష పార్టీల నాయకులను తమవైపు తిప్పుకుని తమ బలం పెంచుకునేందుకు అధికార పక్షం చూస్తుంటే, అధికార పక్షంలో ఉన్న అసంతృప్త నేతలని తమ వైపు తిప్పుకోవడానికి ప్రతిపక్షం చూస్తోంది. అలాగే 2014 లో కాంగ్రెస్ ఏ పరిస్థితులని ఎదుర్కుందో ఇప్పుడు బీజేపీ అదే పరిస్థితిని ఎదుర్కుంటోంది. దీంతో బీజేపీ లో ఉన్న నాయకులు కూడా తమ దారి తాము చూసుకుంటున్నారు.
అలాగే పాణ్యం మాజీ ఎమ్మెల్యే, భాజపా నేత అయిన కాటసాని రామ్ భూపాల్ రెడ్డి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలోకి చేరనున్నట్టుగా వార్తలు వస్తున్నాయి. అందుకోసమే కాటసాని ఇప్పుడు అనుచరవర్గంతో చర్చలు జరుపుతున్నట్టుగా తెలుస్తోంది. పాదయాత్రలో ఉన్న వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్ మోహన్ రెడ్డిని కలిసి కాటసాని వైసీపీలోకి చేరతారని రాజకీయ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. కాంగ్రెస్ పార్టీ తరఫు నుంచి పాణ్యం అసెంబ్లీ సీటు నుంచి ఏకంగా ఐదుసార్లు విజయం సాధించిన రామ్ భూపాల్ రెడ్డి రాష్ట్ర విభజన తర్వాత కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి, స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి ప్రస్తుతం వైసిపి పాణ్యం ఎంఎల్ఏగా గౌరు చరితారెడ్డి చేతిలో ఓడిపోయారు.
రెండో స్థానం సాధించినా కాటసానికి సుమారు 60 వేల ఓట్లొచ్చాయి. ఇంత పట్టున్న స్థానం గనుకనే ఇప్పుడు కూడా జగన్ ని ఇదే టికెట్ కోరే అవకాసం ఉంది. ఒకవేళ జగన్ ఒప్పుకోని పక్షంలో అయితే వైసీపీ నుండి ఎంపీగా పోటీ చేసి తెలుగుదేశం తీర్ధం పుచ్చుకున్న ఎస్పీవై రెడ్డి స్థానంలో నంద్యాల ఎంపి టికెట్ కోరే అవకాశం ఉంది. స్వతంత్ర అభ్యర్ధిగా పోటీ చేసి ఓడిపోయిన అనంతరం కాటసాని బీజేపీ తీర్థం పుచ్చుకున్నారు. రో ఏడాదిలో ఎన్నికలు వస్తున్న తరుణంలో ఏపీలో చెప్పుకోదగిన రీతిలో బీజేపీ బలోపేతం కాకపోవడంతో పార్టీ మారేందుకు సన్నాహాలు చేసుకుంటున్నారు. ఇందులో భాగంగానే ఈ నెల 18న సమావేశమవుతున్నట్టు తెలుస్తోంది. అయితే ఈ విషయం మీద అధికారిక ప్రకటన అయితే వెలువడ లేదు.