Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
నందమూరి బాలకృష్ణ ఎప్పుడైతే ఎన్టీఆర్ జీవిత చరిత్రతో సినిమాను తీయాలని భావిస్తున్నట్లుగా ప్రకటించాడో అప్పుడే వర్మకు కూడా లక్ష్మీస్ ఎన్టీఆర్ చిత్రాన్ని చేయాలనే ఆలోచన వచ్చింది. లక్ష్మీ పార్వతి ఎంటర్ అయిన తర్వాత ఎన్టీఆర్ జీవితంలో జరిగిన పరిణామాలు ఏంటీ అనే విషయాలను వర్మ చూపించేందుకు సిద్దం అవుతుడున్నాడు. ఆ సినిమాలో చంద్రబాబు నాయుడును విలన్‌గా చూపించే అవకాశాలు కనిపిస్తున్నాయి. అందుకే తెలుగు దేశం పార్టీ నాయకులు మరియు మద్దతుదారులు వర్మపై ఆగ్రహంతో ఉన్నారు. వర్మ ఎప్పుడెప్పుడు సినిమా మొదలు పెడతాడో అని కొందరు ఎదురు చూస్తుంటే మరి కొందరు మాత్రం ఆ సినిమాను అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారు.
ఇక తాజాగా వర్మకు పోటీగా అన్నట్లుగా ‘లక్ష్మీస్ వీరగ్రంథం’ అనే చిత్రాన్ని తెరకెక్కించేందుకు కేతిరెడ్డి జగదీశ్వరరెడ్డి సిద్దం అయ్యాడు. ఇప్పటికే ఫస్ట్‌లుక్ కూడా విడుదలైంది. ప్రస్తుతం కేతిరెడ్డి స్క్రిప్ట్‌ను సిద్దం చేసే పనిలో ఉన్నాడు. లక్ష్మీ పార్వతి భర్త వీరగ్రంధం మరియు ఆమె బంధువుల గురించి తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నాడు. తాజాగా గుంటూరు జిల్లాతో పాటు పలు జిల్లాలను తిరిగి లక్ష్మీ పార్వతి పూర్వ జీవితాన్ని తెలుసుకున్నాడు. ఇటీవల లక్ష్మీ పార్వతి సొంత గ్రామంకు వెళ్లిన కేతిరెడ్డి అక్కడ పలు ఆసక్తికర విషయాలను తెలుసుకున్నాను అని, సినిమాలో అవన్ని చూపిస్తాను అంటూ చెప్పుకొచ్చాడు.
లక్ష్మీ పార్వతి మొదటి భర్త వీరగ్రంధం గ్రామానికి కూడా వెళ్లాడు. అక్కడ లక్ష్మీ పార్వతికి వీరగ్రంధంకు అయిన పెళ్లి గురించి, ఎలా వారి పెళ్లి అయ్యింది, పెళ్లి అయిన తర్వాత ఎందుకు వారు విడిపోయారు అనే విషయాలను తెలుసుకునే ప్రయత్నం చేశాడు. మొత్తానికి లక్ష్మీ పార్వతి గురించి ఇప్పటి వరకు తెలుగు ప్రజలకు తెలియని విషయాలను కేతిరెడ్డి తన చిత్రంలో చూపించడం ఖాయంగా కనిపిస్తుంది. లక్ష్మీ పార్వతి ఈ పరిణామాలపై టెన్షన్ పడుతున్నట్లుగా తెలుస్తోంది. ఇప్పటి వరకు కాపాడుకుంటూ వస్తున్న తన గౌరవం సినిమా వల్ల పోతుందనే భయం ఆమెలో కనిపిస్తుంది. తన అనుమతి లేకుండా సినిమా తీస్తే న్యాయ పోరాటం చేస్తాను అంటున్న లక్ష్మీ పార్వతి అసలు జీవితం ఏంటో బయట పడటం ఖాయం అంటూ టీడీపీ వర్గాల వారు అంటున్నారు.