Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
కథువా దారుణం దేశవ్యాప్తంగా ఇంత సంచలనం సృష్టించడానికి…బాధితురాలు ఎనిమిదేళ్ల చిన్నారి కావడంతో పాటు ఆమెపై సామూహిక అత్యాచారం జరిపిన నిందితుల్లో పోలీసులు కూడా ఉండడం ఓ కారణం. సమాజానికి రక్షణగా నిలవాల్సిన పోలీసులే అన్నెం పున్నం ఎరుగని బాలికపై అత్యంత అమానుషంగా ప్రవర్తించడం చూసి దేశం యావత్తూ భయభ్రాంతులకు గురయింది. నిందితులను ఉరితీయాలని నిరసిస్తూ దేశవ్యాప్తంగాఈ ఘటనపై ఆందోళనలు కొనసాగుతున్నాయి. మొత్తం నలుగురు పోలీసులు ఈ కేసులో అరెస్టయ్యారు. వారిలో దీపక్ కజూరియా ఒకరు. ప్రస్తుతం కథువా జైలులో ఉన్నాడు. ఇతనికి గత ఏడాది డిసెంబర్ లో రేణుశర్మ అనే యువతితో నిశ్చితార్థం జరిగింది. ఏప్రిల్ 28న వివాహం చేయాలని పెద్దలు నిశ్చయించారు. అంతలోనే ఈ దారుణం వెలుగుచూసింది. దేశమంతా దీపక్ కజూరియాను అసహ్యించుకుంటోంది. అతను చేసిన దారుణానికి ఉరిశిక్షే సరైందని నమ్ముతోంది. అయితే అతనికి కాబోయే భార్య మాత్రం దీపక్ పై ఎంతో నమ్మకం వ్యక్తంచేస్తోంది. దీపక్ అలాంటివాడు కాదని, అతను నిజంగా తప్పుచేశాడా లేదా అన్న విషయాన్ని తానే స్వయంగా అడిగి తెలుసుకుంటానని రేణు శర్మ అంటోంది.
దీపక్ ను కలవడానికి తనకు అనుమతి ఇవ్వాలని కోరుతోంది. అతని కళ్లలోకి చూసి నిజంగానే ఈ తప్పు చేశాడా అని అడుగుతాను. అతను నాకు అబద్ధం చెప్పడు. ఒకవేళ అతని తప్పు లేదని తెలిస్తే అతనికోసం జీవితాంతం ఎదురుచూస్తాను. తప్పుందని తేలితే మరో వ్యక్తిని పెళ్లిచేసుకుంటాను అని రేణుశర్మ చెప్పింది. నిశ్చితార్థం అయ్యాక తాను, దీపక్ రోజూ ఫోన్ లో మాట్లాడుకునేవాళ్లమని, అతను తన గురించి కానీ, ఇతర అమ్మాయిల గురించి కానీ తప్పుగా మాట్లాడిన సందర్భాలే లేవని రేణు శర్మ అంటోంది. ఈ కేసు విషయంలో నిజం ఏంటో తనకు తెలీదని, కానీ సీబీఐ సరిగ్గా దర్యాప్తు చేపట్టాలని కోరుతున్నానని తెలిపింది. అయితే దీపక్ తల్లిదండ్రులు మాత్రం కొడుక్కి మద్దతు తెలపడం లేదు. జైలుకెళ్లిన తర్వాత ఇప్పటిదాకా తానే తన కుమారుడిని చూడలేదని దీపక్ తల్లి చెప్పింది.