దీప్తిపై విరుచుకు పడుతున్న కౌశల్‌ఆర్మీ

Kaushal Army target on Deepthi In Bigg Boss Show

తెలుగు బిగ్‌బాస్‌ రెండవ సీజన్‌ 50 రోజులు పూర్తి చేసుకుంది. 50వ రోజు ఎపిసోడ్‌లో ఎలిమినేషన్స్‌కు నామినేషన్స్‌ జరిగాయి. ఈ నామినేషన్స్‌లో ఒకటి నుండి పన్నెండు వరకు ఉన్న అంకెల్లో ఒక్కొక్కరు ఒక్కో అంకెను ఎంపిక చేసుకోవాలంటూ సూచించారు. అంతా ఒక్కో నెంబర్‌ వద్ద నిల్చున్నారు. అయితే నెం.3 వద్ద మాత్రం ముందుగా కౌశల్‌ నిల్చుండగా, ఆ తర్వాత దీప్తి వచ్చి తాను కూడా నెం.3 వద్ద నిల్చోవాలని భావిస్తున్నాను అంటూ చెప్పుకొచ్చింది. ఇద్దరు ఎంతగా వాదులాడుకున్నా కూడా నెం.3 మాత్రం కౌశల్‌ వదులుకోలేదు, దీప్తి కూడా మిగిలి ఉన్న 11 వద్దకు వెళ్లేందుకు నిరాకరించింది. 7 నుండి 12 సంఖ్యల బోర్డుల వద్ద ఉన్న వారు నామినేషన్స్‌లో ఉన్నట్లుగా బిగ్‌బాస్‌ ప్రకటించాడు. అయితే 10వ స్థానంలో ఉన్న గీత నామినేషన్స్‌ నుండి సురక్షితురాలు అయ్యింది.

1 నుండి 6వ స్థానం వరకు నిల్చున్న వారు సురక్షితులు అయ్యారు అంటూ బిగ్‌బాస్‌ ప్రకటించాడు. అయితే నెం.3 వద్ద ఇద్దరు ఉన్న కారణంగా ఇద్దరిని కూడా నామినేషన్స్‌లో ఉంచుతున్నట్లుగా ప్రకటించాడు. దాంతో ఇద్దరు కూడా షాక్‌ అయ్యారు. దీప్తి వెళ్లి 11 వద్ద నిల్చుంటే ఆమె ఒక్కతే నామినేట్‌ అయ్యేది. కాని ఇప్పుడు దీప్తి వల్ల కౌశల్‌ కూడా నామినేట్‌ అయ్యాడు. దాంతో సోషల్‌ మీడియాలో భారీ ఎత్తున ఉన్న కౌశల్‌ ఆర్మీ తీవ్ర స్థాయిలో దీప్తిపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దీప్తి గతంలో కూడా కౌశల్‌ను ఇబ్బందికి గురి చేసింది. అందుకే దీప్తిని ఎలిమినేట్‌ చేయాల్సిందే అంటూ కౌశల్‌ ఆర్మీ పిలుపునిచ్చింది. ఈమద్య సోషల్‌ మీడియాలో కౌశల్‌ ఆర్మీ ఏ స్థాయిలో ఉందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. కౌశల్‌ ఆర్మీ సపోర్ట్‌ వల్లే నూతన్‌ నాయుడు ఇంట్లోకి వెళ్లాడు అంటూ కొందరు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. కనుక దీప్తి ఈసారి ఎలిమినేట్‌ అవుతుందేమో అంటున్నారు. మరో వైపు కౌశల్‌ ఆర్మీ బాబును కూడా టార్గెట్‌ చేశారు. మరి ఏం జరుగుతుందో చూడాలి.