వైసీపీకి వలసల జోరు…పార్టీలోకి మాజీ కేంద్రమంత్రి…!

Kavuri Sambasiva Rao To Join YSR Congress Party

ఎన్నికలకు ముందు ఏపీలో ప్రతిపక్ష వైసీపీకి కొత్త జోష్ వస్తోంది. ఇప్పటికే అధికార పార్టీ టీడీపీ నుంచి పలువురు నేతలు వైసీపీ గూటికి చేరారు. చేరుతూనే ఉన్నారు, అయితే ఇప్పుడు బీజేపీ వంతు వచ్చింది. మాజీ కేంద్రమంత్రి, బీజేపీ నేత కావూరి సాంబ‌శివ‌రావు బీజేపీని వీడి వైసీపీలో చేరడానికి సిద్దమైనట్లు ప్రచారం జరుగుతోంది. ఇప్పటికే వైసీపీ కీలక నేత విజయసాయి రెడ్డితో మంతనాలు జరిపిన కావూరి రెండు రోజుల్లో వైసీపీ అధినేత జగన్ ని కలసి పార్టీ తీర్థం పుచ్చుకుంటారని తెలుస్తోంది. కావూరి వచ్చే ఎన్నికల్లో వైసీపీ టికెట్ మీద ఏలూరు లోక్‌సభ స్థానం నుంచి పోటీ చేసే అవకాశం ఉంది. దీనికి సంబంధించి ప్రస్తుతం అంతర్గత చర్చలు జరుగుతున్నాయి. టికెట్ ఖరారైతే కావూరి కాషాయ కండువా తీసేసి వైసీపీ కండువా కప్పుకోవడం ఖాయమని సమాచారం.

కావూరి వైసీపీలో చేరితే ఏపీ బీజేపీకి గట్టి దెబ్బనే చెప్పాలి. గతంలో కావూరి కాంగ్రెస్ పార్టీ నుండి ఐదు సార్లు ఎంపీగా గెలిచారు. మ‌చిలీప‌ట్నం లోక్‌సభ స్థానం నుండి మూడు సార్లు, ఏలూరు లోక్‌స‌భ స్థానం నుండి రెండుసార్లు ఎంపీగా పనిచేసారు. యూపీఏ హయాంలో కేంద్రమంత్రిగా కూడా పనిచేశారు. స‌మైక్యాంధ్ర వాయిస్ ను బ‌లంగా వినిపించిన ఆయన రాష్ట్ర విభ‌జ‌న స‌మ‌యంలో కాంగ్రెస్ ను వీడి టీడీపీలో చేరి ఎన్నికల్లో పోటీ చేయాలనీ చూసినా టికెట్ హామీ లభించకపోవడంతో బీజేపీలో చేరారు. అయితే, 2014 ఎన్నికల్లో మాత్రం ఆయన పోటీ చేయలేదు. ప్ర‌స్తుతం ఏపీలో నెల‌కొన్న రాజ‌కీయ ప‌రిస్థితుల్లో ఆయ‌న బీజేపీని వీడి వైసీపీలో చేరాల‌ని భావిస్తున్నారు. ఏలూరు నుంచి ఎంపీగా పోటీ చేసే ఆలోచనలో ఆయన ఉన్నట్లు సమాచారం. అయితే అయన ఏలూరు ఎంపీగా చేరితే ఇప్పుడు అక్కడ గ్రౌండ్ వర్క్ చేసుకుంటున్న కోటగిరి శ్రీధర్ పరిస్థితి ఏమిటా అనేది ? ఆసక్తికరంగా మారింది,