ఇద్దరిలో ఎవరో మూడో కృష్ణుడు !

KCR And Pranab Mukherjee In Someone are The Third Prime Minister

Posted [relativedate] at [relativetime time_format=”H:i”]

కాదేదీ కవితకనర్హం అన్నట్టు కాదెవరూ పదవులకి అనర్హం అనుకునే రోజులు వచ్చే పరిస్థితులు కనపడుతున్నాయి. రాజకీయాల్లో ఎప్పుడైనా ఏదైనా జరగొచ్చని, అసాధ్యం అంటూ ఏమీ ఉండదనేది చరిత్ర చెబుతోంది. తాజాగా మరో ఆశ్చర్యకరమైన, ఎవరూ ఊహించని వార్త ఒకటి ఢిల్లీ రాజకీయాల్లో వేడి పుట్టిస్తోంది. మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్, బీజేపీ యేతర పార్టీల(ఫెడరల్ ) ప్రధానమంత్రి అభ్యర్థిగా బరిలోకి దిగనున్నారన్నదే ఆ వార్త సారంశం. ఫెడరల్ ఫ్రంట్ ఏర్పాటు కేసీఆర్ చేసినా దాని వెనుకున్నది ప్రణబ్ అనే విషయం ఇప్పుడు తాజాగా హాట్ టాపిక్ గా మారింది. గత కొన్ని రోజులుగా జరుగుతున్న రాజకీయ పరిణామాలను గమనిస్తున్న రాజకీయ విశ్లేషకులు ఈ విషయాన్ని తెర మీదకి తెచ్చారు. కాంగ్రెస్ సీనియర్ నేతగా, రాజకీయ ఉద్ధండుడిగా పేరు గాంచిన ప్రణబ్ ఆరెస్సెస్ సమావేశానికి హాజరుకానున్నారన్న వార్త తాజాగా ప్రకంపనలే రేపింది. ఆరెస్సెస్ అధినేత మోహన్ భగత్ పంపిన ఆహ్వానాన్ని ప్రణబ్ అంగీకరించినప్పుడే ఏదో జరగబోతోందని విశ్లేషకులు అంటున్నారు.

మోడీ వర్సెస్ అంటూ ఎన్డీటీవీ వాళ్లు ఒక కధనంలో ప్రణబ్‌ను తెరపైకి తీసుకొచ్చారు. కాంగ్రెసేతర, బీజేపీయేతర పార్టీలను ఒక గొడుగు కిందకు తెచ్చేందుకు ప్రణబ్ ముఖర్జీ అయితే ఆమోదయోగ్యుడని ఎన్డీటీవీ కథనంలో ప్రధానంగా వినిపించింది. ప్రణబ్‌ను ప్రధానిగా చేయడానికి చాలామంది నేతలు సానుకూలంగా ఉన్నారని ప్రధానంగా మమతా బెనర్జీ, నవీన్ పట్నాయక్ లాంటి నాయకుల ఆధ్వర్యంలోని రెండు ప్రాంతీయ పార్టీల బలం ప్రణబ్ అభ్యర్థిత్వానికి ప్రారంభం కాగలదని.. ఎన్డీయేతర, యూపీయేతర ప్రాంతీయ పార్టీలు కూడా ప్రణబ్ అభ్యర్థిత్వం పట్ల సానుకూలంగా స్పందించవచ్చు అంటున్నారు. ఆరెస్సెస్ సమావేశానికి హాజరు కావడం ద్వారా తానింకా రాజకీయాల్లోనే ఉన్నానని సందేశం ఇవ్వడమే ప్రణబ్ ఉద్దేశమని చెబుతున్నారు.

గత జనవరిలో బిజూ పట్నాయక్ జీవిత చరిత్ర పుస్తక ఆవిష్కరణ సందర్భంగా ఒడిశా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ భువనేశ్వర్‌లో ఇచ్చిన విందుకు ప్రణబ్ హాజరయ్యారు. దేవెగౌడ, సీతారాం ఏచూరి, ఎల్‌కే అద్వానీ తదితరులు కూడా దీనికి విచ్చేశారు. అయితే, ఈ విందు గురించి మీడియాలో ఎక్కడా హడావుడి కనిపించలేదు. పేరుకు ఇది బిజూ పట్నాయక్ జీవిత చరిత్ర పుస్తక ఆవిష్కరణ సమావేశమే అయినా, నిజానికి ఇక్కడ కీలక చర్చలు జరిగినట్టు ఇప్పుడు బయటపడిందని సదరు కధనంలో పేర్కొన్నారు. మూడో ఫ్రంట్ ఏర్పాటుకు సంబంధించి నేతలందరూ చర్చించినట్టు సమాచారం. గతంలో ప్రణబ్ ఓ సందర్భంలో మాట్లాడుతూ .. యూపీఏ-2 హయాంలో సోనియా తనను ప్రధానిని చేస్తారని భావించినట్టు చెప్పడం ద్వారా ప్రధాని కావాలన్న కాంక్ష తనలో ఉన్న విషయాన్ని బయటపెట్టారు.

అలాగే ఇందిరా గాంధీ హత్యానంతరం కూడా రాజీవ్ వల్ల ఆయనకీ పదవి చేజారింది అని చెప్తారు ప్రణబ్ ముఖర్జీకి ఎప్పటినుంచో ప్రధాని కావాలన్న ఆశ బలంగా ఉండేది. కానీ సోనియా గాంధీ ప్రణబ్ ప్రధాని అయితే తన ప్రతిష్ట మసకబారుతుందని ఆయన్ను ఆర్థిక మంత్రిగానే కొనసాగించి ప్రధాని ఆశలపై నీళ్లు చల్లారు. ఇక ఆ తర్వాత ప్రణబ్ ఉంటే ఎప్పటికైనా తన కొడుకు రాహుల్ కు పోటీ వస్తాడని భావించిన సోనియా ఆయన్ను రాష్ట్రపతి చేసి క్రియాశీల రాజకీయాల నుంచి తప్పించింది..కాబట్టి ఇవన్నీ చూస్తుంటే వచ్చే ఎన్నికల్లో ఆయన మూడో ఫ్రంట్ నుంచి ప్రధాని అభ్యర్థిగా బరిలోకి దిగే అవకాశాలను కొట్టి పడేయలేమని విశ్లేషకులు చెబుతున్నారు.