కేసీఆర్ క్యాబినెట్ అప్డేట్…త్వరలోనే !

Telangana Cm Kcr All Set Expand Cabinet Likely Induct 10 Ministers

ఇటీవలే తెలంగాణాలో ఎన్నికలు జరిగిన సంగతి తెలిసిందే. ఈ ఎన్నికల్లో రెండో సారి తెలంగాణా ముఖ్యమంత్రిగా కేసీఆర్ ఎన్నికయ్యారు. అయితే ఆయన ప్రమాణ స్వీకారం చేసి దగ్గర దగ్గర రెండు నెలలు కావోస్తున్నా ఇప్పటి వరకూ మంత్రి వర్గం ఏర్పాటు చేయలేదు. అయితే ఫిబ్రవరి తొలివారంలోగా క్యాబినెట్ విస్తరణ ఉంటుందని గవర్నర్‌కు కేసీఆర్ చెప్పినట్టు వార్తలు వెలువడుతున్నాయి. అయితే ముఖ్యమంత్రి కేసీఆర్ మంత్రివర్గ విస్తరణలో అనుభవానికి పెద్దపీట వేయాలని భావిస్తున్నారని అంటున్నారు. తొలివిడత విస్తరణలో ఎక్కువసార్లు ఎమ్మెల్యేగా గెలిచిన వారికి ఈ సారి ప్రాధాన్యం ఇవ్వనున్నట్టు సమాచారం. తొలిసారి ఎమ్మెల్యే అయిన వారిలో ఒకరిద్దరికి మాత్రమే అవకాశం ఉన్నట్లు సమాచారం అందుతోంది. ఇందుకు అనుగుణంగా ముఖ్యమంత్రి కేసీఆర్‌ తన నివాసంలో కసరత్తు చేసినట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం.

కేటీఆర్‌ కి ఈ సార డౌటే కానీ హరీశ్‌రావుకు మళ్లీ మంత్రి పదవులు పక్కా అని అంటున్నారు. నిజామాబాద్‌ నుంచి ప్రశాంత్‌రెడ్డి లేదా బాజిరెడ్డి గోవర్ధన్‌, ఆదిలాబాద్‌ నుంచి రేఖానాయక్‌ పేరు వినిపిస్తోంది. ఎస్టీ, మహిళా కోటా రెండూ ఆమెకు కలిసిరానున్నాయి. అయితే, మెదక్‌ నుంచి పద్మాదేవేందర్‌రెడ్డికి అవకాశం దక్కితే రేఖానాయక్‌కు రిక్తహస్తమే. ఈ సందర్భంలో ఆదిలాబాద్‌ నుంచి ఇంద్రకరణ్‌రెడ్డి, జోగు రామన్నలలో ఎవరో ఒకరికి అవకాశం దక్కే సూచనలు ఉన్నాయి. ఇక మహబూబ్‌నగర్‌ నుంచి శ్రీనివాస్‌గౌడ్‌, లక్ష్మారెడ్డి లేదా నిరంజన్‌రెడ్డి, నల్గొండ నుంచి జగదీశ్‌రెడ్డి, గుత్తా సుఖేందర్‌రెడ్డి, నోముల నర్సింహయ్య, కరీంనగర్‌ నుంచి ఈటల రాజేందర్‌, కొప్పుల ఈశ్వర్‌, ఖమ్మం నుంచి పువ్వాడ అజయ్‌, రంగారెడ్డి నుంచి నరేందర్‌రెడ్డి, హైదరాబాద్‌ నగరం నుంచి తలసాని శ్రీనివాస్‌యాదవ్‌, వరంగల్‌ నుంచి మాజీ మంత్రి కడియం శ్రీహరి, ఎర్రబెల్లి దయాకర్‌రావు, రెడ్యానాయక్‌, శాసనమండలి విప్‌ పల్లా రాజేశ్వర్‌రెడ్డి పేర్లు వినిపిస్తున్నాయి. క్యాబినెట్ విస్తరణలో భాగంగా తొలి విడత ఎనిమిది మందికి అవకాశం కల్పించాలని సీఎం భావిస్తున్నట్టు తెలుస్తోంది. లోక్‌సభ ఎన్నికల తర్వాత మిగతా పదవులు భర్తీ చేసి అన్ని జిల్లాలకు ప్రాతినిధ్యం కల్పించనున్నారు.