తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ లాక్ డౌన్ సడలింపులపై కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఈరోజు లాక్డౌన్ మినహాయింపులతో పాటు అనేక అంశాలపైనా కేబినెట్ సుదీర్ఘంగా చర్చించింది. రాష్ట్రంలో కంటైన్మెంట్ ఏరియాలు తప్ప మిగిలిన అన్ని ప్రాంతాలను గ్రీన్ జోన్లుగా తెలంగాణ సీఎం కేసీఆర్ ప్రకటించారు. ఇక ఇప్పటికే 29వరకు లాక్ డౌన్ ప్రకటించామని తెలిపిన ఆయన కేంద్రం చెప్పినట్టు తెలంగాణలో కూడా 31 వరకు లాక్డౌన్ను కొనసాగిస్తామని స్పష్టం చేశారు. కంటైన్మెంట్ ఏరియాలలో కేవలం 1452 కుటుంబాలు మాత్రమే ఉన్నాయని… ఆయన వివరించారు.
ఇక తెలంగాణలో లాక్డౌన్ మార్గదర్శకాల గురించి కేసీఆర్ సుదీర్ఘంగా వివరించారు. కంటైన్మెంట్ ఏరియాలో లాక్డౌన్ అమలులో ఉంటుందని, పూర్తిగా పోలీసు పహారాలోనే కంటైన్మెంట్ ఏరియా ఉంటుందని పేర్కొన్నారు. కంటైన్మెంట్ ఏరియాలో ఉండే కుటుంబాలకు నిత్యావసరాలు ప్రభుత్వమే సరఫరా చేస్తుందని వెల్లడించారు. ఇక కరోనాకు వ్యాక్సిన్ రేపోమాపో వచ్చే పరిస్థితి లేదని ప్రపంచం అంగీకరించిందని చెప్పిన ఆయన కరోనాతో కలసి జీవించడం నేర్చుకోవాలని అన్నారు. ప్రతి వ్యక్తీ కూడా బ్రతుకుదెరువు కోసం అన్ని జాగ్రత్తలు తీసుకొని ముందుకు సాగాలని కేసీఆర్ వివరించారు.
అదేవిధంగా రేపటి నుంచి హైదరాబాద్ తప్పా.. రాష్ట్రంలో అన్ని చోట్లా అన్ని షాపులూ తెరుచుకోవచ్చని అన్నారు. హైదరాబాద్లో మాత్రం సరి-భేసి విధానం అమలులో ఉంటుంనది తెలిపారు. అలాగే.. కంటైన్మెంట్ మినహా అన్ని చోట్లా సెలూన్లు తెరుచుకోవచ్చని.. ఈ-కామర్స్కు నూరు శాతం అనుమతి ఉంటుందని స్పష్టం చేశారు. ఇంకా ప్రభుత్వ, ప్రైవేటు కార్యాలయాలు కొవిడ్ జాగ్రత్తలు పాటిస్తూ.. పనిచేసుకోవచ్చని.. పరిశ్రమలు, ఫ్యాక్టరీలు, మానుఫాక్చరింగ్ యూనిట్లు తెరుచుకోనున్నట్లు వెల్లడించారు. కాగా మే 31 వరకు మాత్రం రాష్ట్రంలో కర్ఫ్యూ యథాతథంగా ఉంటుందని కేసీఆర్ తెలిపారు.
అంతేకాకుండా కేంద్రం ప్యాకేజీపై కేసీఆర్ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ఇది పూర్తిగా మోసపూరితంగా ఉందని, రాష్ట్రాలను బిక్షగాళ్లుగా చేసిందని తెలిపారు. కేంద్రం ప్యాకేజీ అంటేనే అంకెల గారడీ అని.. రాష్ట్రాలకు ఆదాయాలు లేని పరిస్థితిలో నిధులు ఇవ్వాలని అడిగితే ఇంత దిక్కుమాలిన తనంగా కేంద్రం ప్రవర్తించిందని, ఇది ఒక ప్యాకేజీనా అంటూ కేసీఆర్ తీవ్రస్థాయిలో దుమ్మెత్తిపోశారు.
అసలు రుణ పరిమితి కూడా షరతులతో పెట్టడం ఏంటి? మున్సిపాల్టీలలో పన్ను పెంచితే మరో 2000 కోట్ల అప్పు ఇస్తారట. ముష్టి రూ.2500 కోట్లు మాకేమొద్దు అని అన్నారు. ఒన్ నేషన్, ఒన్ రేషన్ కార్డు, ఈజ్ ఆఫ్ డూయింగ్.. మరో కండిషన్. ఇది పచ్చి మోసం, అంకెల గారడి అని కేంద్రం తన పరువు తానే తీసుకుందని కేసీఆర్ వెల్లడించారు.
ఇంకా ప్రజా రవాణా విషయంలో రాష్ట్రాలదే నిర్ణయమని చెప్పడంతో… కరోనా పాజిటివ్ కేసులు ఎక్కువగా ఉన్న జీహెచ్ఎంసీ పరిధిలో తప్పక మిగతా ప్రాంతాల్లో బస్సులు నడపాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. అందులో భాగంగా రేపటి నుంచి రాష్ట్రవ్యాప్తంగా ఆర్టీసీ బస్సులు నడుస్తాయని కేసీఆర్ వెల్లడించారు. ఎట్టి పరిస్థితుల్లో సిటీ బస్సులను మాత్రం అనుమతించమని స్పష్టం చేశారు. కోవిడ్ నిబంధనలు పాటిస్తూ ఆర్టీసీ బస్సులు నడుస్తాయని వివరించారు. అలాగే..
సిటీ శివార్ల నుంచే తెలంగాణ జిల్లాలకు బస్సు సర్వీసులను నడపనుంది ప్రభుత్వం. హైదరాబాద్లో ఆటోలు, ట్యాక్సీలకు అనుమతి ఇస్తున్నట్లు కేసీఆర్ ప్రకటించారు. ట్యాక్సీ, ఆటోల్లో ముగ్గురు ప్రయాణికులకు అనుమతిచ్చారు. ఇక ఈనెల 31వరకూ మెట్రో రైలు సర్వీసులు నడపబోమని తేల్చి చెప్పారు. మొత్తానికి కాస్త ఉపశమనంగా ప్రజలకు భారీగానే సడలింపులైతే ఇచ్చారు గానీ.. కరోనా కేసులు పెరుగుదల వంటి అంశాలలో ప్రజల్లో ఉన్న భయం సంగతి ఏంటి అనేది మాత్రం ప్రశ్నార్థకంగానే ఉంది.