పీవీ నరసింహరావు గారికి భారతరత్న

పీవీ నరసింహరావు గారికి భారతరత్న

దివంగత మాజీ ప్రధానమంత్రి పీవీ నరసింహరావుకు భారతరత్న ఇవ్వాలని ముఖ్యమంత్రి కే. చంద్రశేఖరరావు అన్నారు. వర్షాకాల శాసనసభ రెండో రోజు సమావేశాలు మంగళవారం ప్రారంభమయ్యాయి. పీవీకి భారతరత్న ఇవ్వాలన్న తీర్మానాన్ని ఈ సందర్భంగా సభలో ప్రవేశపెట్టారు. సీఎం కేసీఆర్‌ మాట్లాడుతూ.. నూతన ఆర్థిక సంస్కరణల సృష్టికర్త పీవీ అని కొనియాడారు. తెలంగాణ ముద్దుబిడ్డ పీవీ మన ఠీవి అని, ఆయనకు లభించాల్సిన గౌరవం దక్కలేదన్నారు. ఏడాది పాటు పీవీ శతజయంతి ఉత్సవాలు నిర్వహిస్తున్న విషయాన్ని గుర్తుచేశారు.

గ్లోబల్‌ ఇండియా నిర్మాత పీవీ నరసింహారావు అని, దేశం అనేక సవాళ్లను ఎదుర్కొంటున్న సమయంలో పీవీ ప్రధాని అయ్యారని కేసీఆర్‌ తెలిపారు. పీవీ అనేక సాహసోపేతమైన నిర్ణయాలు తీసుకున్నారని చెప్పారు. మన్మోహన్‌ సింగ్‌ను ఆర్థిక మంత్రి చేసిన ఘనత పీవీది అని పేర్కొన్నారు. పీవీ నాటిన సంస్కరణ ఫలితాలను ఇప్పుడు అనుభవిస్తున్నామని సీఎం తెలిపారు. భూ సంస్కరణలకు పీవీనే నాంది పలికారని గుర్తుచేశారు. తన సొంత భూమి 800 ఎకరాలను ప్రభుత్వానికి స్వాధీనం చేశారని కొనియాడురు. హైదరాబాద్‌లో ఉన్న సెంట్రల్‌​ యూనివర్సిటీకి పీవీ పేరు పెట్టాలని సీఎం కేసీఆర్‌ డిమాండ్‌ చేశారు.