రేవంత్ కు కేసీఆర్ భయపడ్డారా ?

kcr fear about revanth

తెలంగాణలోని ఊర మాస్ ఫాలోయింగ్ ఉన్న లీడర్లలో టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్‌రెడ్డి ఒకరు. ప్రభుత్వం పై, ప్రభుత్వ అధినేత మీదా విమర్శనాస్త్రాలు సంధిస్తూ నిరంతరం వార్తల్లో నిలిచే ఆయన గడచిన నాలుగున్నరేళ్ళలో మంచి ఫాలోయింగ్ దక్కించుకున్నారు. అయితే గతంలో తెలుగుదేశంలో ఉండి తర్వాత కాంగ్రెస్ తీర్ధం పుచ్చుకున్న ఆయన ఈ ఎన్నికల్లో ప్రజా ఫ్రంట్‌‌ను అధికారంలోకి తీసుకురావాలని ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నారు. ఇందుకోసం రాష్ట్ర వ్యాప్తంగా ప్రచారం చేయాలని, కూటమి అభ్యర్థులను గెలిపించాలని ప్రణాళిక వేసుకున్నారు. అయితే, తమకు కొరకరాని కొయ్యగా మారిన రేవంత్‌ను ఈసారి అసెంబ్లీలోనే అడుగు పెట్టనివ్వవద్దన్న పట్టుదలతో ఉన్న అధికార టీఆర్‌ఎస్‌.. అందుకోసం పలు వ్యూహాలు సిద్ధం చేసింది. ఇందులో భాగంగానే మంత్రి పట్నం మహేందర్‌రెడ్డి తమ్ముడు నరేందర్‌రెడ్డిని ఎన్నికల బరిలో దించింది. అన్నిరకాల అండదండలు అందిస్తోంది. కేటీఆర్‌, హరీశ్‌రావు సహా పలువురు మంత్రులు, ఎంపీలు నరేందర్‌రెడ్డికి మద్దతుగా ప్రచారం చేశారు. అలాగే ఈ నెల 4 కేసీఆర్ నిర్వహించిన బహిరంగ సభను అడ్డుకోవాలని రేవంత్ నిర్ణయించుకున్నారు.ఈ మేరకు కేసీఆర్‌ సభను బహిష్కరించాలంటూ కోడంగల్‌ బంద్‌కు పిలువునిచ్చిన నేపథ్యంలో 3న అర్ధరాత్రి రేవంత్‌రెడ్డిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఇది తెలంగాణ రాజకీయాల్లో సంచలనం అయింది. ఎన్నికల ప్రచారంలో భాగంగా ముఖ్యమంత్రి కేసీఆర్‌ మంగళవారం కోస్గిలో నిర్వహించే బహిరంగ సభలో పాల్గొనాల్సి ఉంది.

Revanth Urges EC To Book Case Against KCR For Offering Rs 10 Crore

దానికి రెండ్రోజుల ముందు రోజు పోలీసులు ఆయన ఇంటిపై దాడి చేశారు. దానిపై శనివారం అర్ధరాత్రి సమయంలో రేవంత్‌ రోడ్డుపై ధర్నా చేశారు. సీఎం పర్యటన నేపథ్యంలో మంగళవారం నియోజకవర్గంలో ఎక్కడికక్కడ నిరసనలు తెలపాలని, సీఎం కేసీఆర్‌ను అడ్డుకోవాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు. దీనిపై టీఆర్‌ఎస్‌ నేతలు ఎన్నికల కమిషన్‌కు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు రిటర్నింగ్‌ అధికారి అరుణకుమారి రేవంత్‌కు నోటీసులు జారీ చేశారు. ఈ నేపథ్యంలోనే మంగళవారం తెల్లవారు జామున 3 గంటల సమయంలో కొడంగల్‌లోని రేవంత్‌రెడ్డి నివాసాన్ని సుమారు 100 మంది పోలీసులు ఆయన మోహరించారు.మరో 50 మంది వరకూ పోలీసులు గేటుపై నుంచి దూకి ఇంట్లోకి వెళ్లారు. నేరుగా ఆయన బెడ్‌రూం వద్దకు వెళ్లారు. తలుపు కొట్టి ఆయనను నిద్ర లేపలేదు. ఆ చీకట్లో ఐదు నిమిషాల్లోనే రేవంత్‌ రెడ్డి బెడ్‌రూం తలుపులు బద్దలు కొట్టి నేరుగా లోనికి ప్రవేశించి, ఆయనను అరెస్ట్ చేశారు. పోలీసుల హైడ్రామా రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర సంచలనం రేకెత్తించింది. రేవంత్‌రెడ్డి అరెస్టుకు సంబంధించి వివరణ ఇచ్చేందుకు డీజీపీ మహేందర్‌రెడ్డి బుధవారం స్వయంగా హైకోర్టుకు హాజరయ్యారు. రేవంత్‌రెడ్డిని అరెస్టు చేయాలంటూ ఇంటెలిజెన్స్‌ బ్యూరో అధికారి ఒక తెల్ల కాగితంపై ఎలాంటి తేదీలు, సీల్‌ లేకుండా సిఫార్సు చేయడం, దాన్ని జిల్లా ఎస్పీ కూడా అంతే నిర్లక్ష్యంగా ఆమోదించి అరెస్టుకు ఆదేశించడాన్ని హైకోర్టు తీవ్రంగా తప్పుబట్టింది. అలాగే వికారాబాద్ ఎస్పీపై కూడా బదిలీవేటు కూడా వేశారు. అలాగే కేసీఆర్, తెలంగాణ అసెంబ్లీని రద్దు చేసిన క్షణం నుంచి, ఎన్నికలు నిర్వహించేందుకు దాదాపు నాలుగు నెలలుగా పడిన కష్టం, ఒక్క పూటలో విలువ లేకుండా పోయిందని చీఫ్ ఎలక్షన్ కమిషనర్ రజత్ కుమార్ మనస్తాపం చెందారు.

revanth reddy campaign in kondakal

రేవంత్ రెడ్డి అరెస్ట్ ను కేంద్ర ఎన్నికల సంఘం తీవ్రంగా తప్పుబట్టడం, హైకోర్టు మందలించడంతో ఆయన కలత చెందారు. ఈ ఘటన ఆయనకు తీవ్ర ఆగ్రహాన్ని సైతం తెప్పించిందని, ఆయనను కలిసేందుకు కార్యాలయ వర్గాలు సైతం భయపడుతున్నాయని తెలుస్తోంది. ఎన్నికల సంఘం పనితీరుపై హైకోర్టు న్యాయమూర్తులు చేసిన తీవ్ర వ్యాఖ్యలు ఆయనకు మనస్తాపం కలిగించినట్టు తెలుస్తోంది. కేసీఆర్‌ బహిరంగ సభను వ్యతిరేకించిన రేవంత్, బంద్ కు పిలుపునివ్వగా, శాంతిభద్రతల సమస్య తలెత్తకుండా ‘అవసరమైన చర్యలు’ తీసుకోవాలని మాత్రమే తాను ఆదేశిస్తే, ముందు జాగ్రత్త చర్యగా అరెస్టు చేయాలని ఎస్పీ అన్నపూర్ణ నిర్ణయం తీసుకున్నారని, దీంతో తనపై అపవాదులు వచ్చాయని ఆయన తన సన్నిహితుల వద్ద వ్యాఖ్యానించినట్టు సమాచారం. రేవంత్ ను అరెస్ట్ చేసి తీసుకెళ్లకుండా, గృహ నిర్బంధంలో ఉంచితే ఇంత వివాదం వచ్చుండేది కాదని ఆయన అభిప్రాయపడ్డారు. ఈ మొత్తం వ్యవహారంతో తీవ్ర అసంతృప్తికి లోనైన రజత్ కుమార్, గత రెండ్రోజులుగా విలేకరులను సైతం కలిసేందుకు ఇష్టపడకపోవడం గమనార్హం. కానీ ఈ రచ్చ అంతటికీ కారణం టీఆర్ఎస్ ముఖ్య నేతలేనని తెలుస్తోంది. రేవంత్, కేసీఆర్ సభను అడ్డుకుంటే తమ పరువు పోతుందని ఆ పార్టీ అధిష్ఠానం భావించిందట. అందుకే ప్రజల్లో వ్యతిరేకత వస్తుందని తెలిసినా రేవంత్‌ను అరెస్ట్ చేయాల్సిందిగా డీజీపీని కోరినట్లు ప్రచారం జరుగుతోంది.