అత్తి వరదార్ స్వామి దర్శనానికి వెళ్లనున్న కేసీఆర్

kcr-is-going-to-visit-atti-varadar-swami
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఈరోజు ఏపీ, తమిళనాడు రాష్ట్రాల్లో పర్యటించనున్నారు. కంచిలో 40ఏళ్లకోసారి దర్శనమిచ్చే అతివరదర్ స్వామి వారిని కేసీఆర్ ఈరోజు కుటుంబసమేతంగా దర్శించుకోనున్నారు.
ఉదయం బేగంపేట విమానాశ్రయం నుంచి 8.55 గంటలకు కుటుంబ సమేతంగా ప్రత్యేక విమానంలో బయలుదేరనున్న కేసీఆర్ 9.55 గంటలకు చిత్తూరు జిల్లా రేణిగుంట ఎయిర్‌పోర్ట్‌కు చేరుకోనున్నారు.
అక్కడి నుంచి రోడ్డుమార్గంలో కంచి చేరుకుని అత్తివరదార్ స్వామిని దర్శించుకుంటారు. అక్కడి నుంచి శివకాశి వెళ్తారు. ఆ తర్వాత తిరిగి రోడ్డుమార్గంలో తిరుపతి చేరుకుంటారు. మధ్యాహ్నం ఒంటి గంట సమయంలో తిరుమలకు వెళ్లి శ్రీవెంకటేశ్వర స్వామిని దర్శించుకుంటారు.
అనంతరం అక్కడే భోజనం చేసి 3 గంటల సమయంలో రేణిగుంటకు చేరుకుని అక్కడి నుంచి హైదరాబాద్ పయనమవుతారు. అత్తివరదర్ స్వామి ఆగస్టు 17వరకు మాత్రమే దర్శనం ఇవ్వనున్న నేపథ్యంలో ఆయన్న చూసి తరించేందుకు దేశవ్యాప్తంగా భక్తులు తరలివస్తున్నారు.
దీంతో కంచి పట్టణం కిక్కిరిసిపోయి స్థానికులు బయటకు వచ్చి పనులు చేసుకునే అవకాశం కూడా లేదు. దీంతో పోలీసులు ఆంక్షలు విధించారు. బయటి ప్రాంతాల నుంచి వచ్చే వారికి పోలీసులు చుక్కలు చూపిస్తున్నారు.