వైసీపీ ఎమ్మెల్సీ అభ్యర్థులు ఖరారు…ఆయనకు నిరాశే!

YCP MLC candidates finalized ... He is disappointed!

ఏపీలో మూడు ఎమ్మెల్సీ స్థానాలకు నోటిఫికేషన్ వెలువడిన సంగతి తెలిసిందే. ఆగష్టు 26న ఎన్నికలు నిర్వహించనుండగా ఈ బుధవారంతో నామినేషన్ల ప్రక్రియ ముగియనుంది. సంఖ్యాబలం కారణంగా ఈ మూడు స్థానాలు వైఎస్ఆర్సీపీ ఖాతాలో చేరనున్నాయి.

ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీకి చెందిన కరణం బలరామ కృష్ణమూర్తి, వైసీపీకి చెందిన ఆళ్ల శ్రీనివాస్ (నాని), కొలగట్ల వీరభద్ర స్వామి ఎమ్మెల్యేలుగా గెలుపొందటంతో ఈ మూడు ఎమ్మెల్సీ స్థానాలు ఖాళీ అయ్యాయి. వీరిలో ఆళ్ల నాని డిప్యూటీ సీఎంగా ఎన్నికయ్యారు.

ఈ మూడు స్థానాలకు ఉపఎన్నిక నిర్వహించేందుకు ఈసీ నోటిఫికేషన్ జారీ చేసింది. నామినేషన్లకు తుది గడువు దగ్గర పడుతుండటంతో వైఎస్ఆర్సీపీ అభ్యర్థుల పేర్లను సీఎం జగన్ ఖరారు చేశారు. అందరూ ఊహించినట్టుగానే మంత్రి మోపిదేవి వెంకటరమణ, మైనార్టీ నాయకుడు మహ్మద్‌ ఇక్బాల్‌కు ఈ జాబితాలో చోటు దక్కింది.

మూడో స్థానం కోసం కర్నూలు జిల్లా సీనియర్‌ నాయకుడు చల్లా రామకృష్ణారెడ్డి పేరును ఖరారు చేశారు. అయితే నిజానికి ఇక్బాల్ హిందూపురం నుంచి పోటీ చేసిన నందమూరి బాలకృష్ణ చేతిలో ఓడారు. మైనార్టీ కోటాలో ఆయన పేరు ఖరారు చేశారు. ఆది నుంచి తనతోపాటే ఉండి, కేసుల్లో జైలుకు వెళ్లిన మోపిదేవికి మంత్రి పదవి ఇచ్చిన జగన్ ఇప్పుడు ఆయన్ను ఎమ్మెల్సీ చేస్తున్నారు.

మూడో ఎమ్మెల్సీ స్థానాన్ని చిలకలూరి పేటకు చెందిన మర్రి రాజశేఖర్‌కు కేటాయిస్తారని భావించారు. బీసీ మహిళ అయిన విడదల రజినీకి ఎమ్మెల్యే టికెట్ ఇచ్చిన జగన్ ప్రత్తిపాటి పుల్లారావును ఓడిస్తే మర్రి రాజశేఖర్‌‌ను మంత్రి చేస్తానని మాటిచ్చారు. కానీ మంత్రివర్గ జాబితాలో ఆయనకు చోటు దక్కలేదు. ఇప్పుడు ఎమ్మెల్సీ పదవి కూడా ఆయనకు లభించలేదు. చూడాలి మరి ఆయనకు ఎలా న్యాయం చేస్తారో.