తెలంగాణ సీఎం కేసీఆర్ సాహిత్యాభిరుచి ఉన్న వ్యక్తి అనే సంగతి తెలిసిందే. ఓ చిత్రంలోని పాట నచ్చడంతో ఆ చిత్రానికి దర్శకత్వం వహించిన కె. విశ్వనాథ్ ను కలిసి తన ఆలోచనలను ఆ మహా దర్శకుడితో పంచుకున్నారు.
మీ సినిమాలోని పాట నాకు బాగా నచ్చిందంటూ ముందుగానే కె.విశ్వనాథ్ కు ఫోన్ చేసిన కేసీఆర్, మీ నివాసానికి రావాలనుకుంటున్నాను అని అనుమతి తీసుకున్నారు. ఈ క్రమంలో తన సన్నిహితులతో కలిసి ఫిలింనగర్ లోని కె. విశ్వనాథ్ నివాసానికి వెళ్లారు.
ఈ సందర్భంగా కేసీఆర్ మాట్లాడుతూ, మళ్లీ దర్శకత్వం వహించాల్సిందిగా కె. విశ్వనాథ్ ను కోరారు. ‘మీరు సినిమాలు తీసి పదేళ్లు కావస్తోంది, మళ్లీ మెగాఫోన్ పట్టండి’ అంటూ విజ్ఞప్తి చేశారు. ‘మీరు దర్శకత్వం వహించండి… నిర్మాణ వ్యవహారాలు నేను చూసుకుంటాను’ అంటూ ప్రతిపాదించారు.
అయితే, కె. విశ్వనాథ్ మాత్రం తన నిస్సహాయతను వ్యక్తం చేశారు. తాను మళ్లీ దర్శకత్వం చేపట్టలేనని తెలిపారు. తన ఇంటికి తెలంగాణ సీఎం రావడం పట్ల కె. విశ్వనాథ్ ఆనందం వ్యక్తం చేశారు.
కేసీఆర్ లో ఇన్ని కోణాలున్నాయని తనకు ఇప్పుడే తెలిసిందని అన్నారు. ఆయన మంచి సాహిత్య అభిలాష ఉన్న వ్యక్తి అని కొనియాడారు శ్రీకృష్ణుడు కుచేలుడి ఇంటికి వచ్చినట్టు ఉందన్నారు.