తెలంగాణ ప్రభుత్వం మరో కొత్త కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. ఇవాళ రాష్ట్రంలో రైతు వేదికను ప్రారంభించారు ముఖ్యమంత్రి కేసీఆర్. జనగామ జిల్ల కొడకండ్లలో సీఎఎం కేసీఆర్ రైతు వేదికను ప్రారంభించారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ.. ప్రపంచంలో ఎక్కడా రైతులకు వేదికలు లేవన్నారు. అమెరికా, యూరప్‌లో కూడా రైతులు నిరసనలు తెలియజేస్తూనే ఉంటారని అన్నారు. ఇప్పటి వరకు రైతులకు ఒక వ్యవస్థ అంటూ లేదన్నారు.
తెలంగాణ రైతులు దేశంలో అగ్రగామిగా నిలవాలని ఆకాక్షించారు కేసీఆర్. రైతులంతా వాస్తవాలు తెలుసుకోవాల్సిన అవసరం ఉందన్నారు. దేశంలో ఏ రాష్ట్ర ప్రభుత్వం కూడా ధాన్యం కొనుగోలు చేయట్లేదన్నారు. ధాన్యం కొనుగోలు చేసే ఏకైక రాష్ట్రం తెలంగాణ మాత్రమే అన్నారు. గ్రామాల్లోనే ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేశామని ఈ సందర్భంగా కేసీఆర్ పేర్కొన్నారు. ఏ పంట వస్తే లాభమో రైతు వేదికలే నిర్ణయించాలన్నారు. మద్దతు ధరను కూడా నిర్ణయించాలన్నారు. ప్రత్యేక అధికారుల్ని నియమించి రైతులకు సూచనలిస్తామన్నారు కేసీఆర్. ఇతర దేశాల్లో రైతులకు ప్రభుత్వాలు రాయితీలు ఇస్తున్నాయి. రైతులకు సబ్సిడీలు ఇస్తామంటే కేంద్రం ఇవ్వొద్దని ఆంక్షలు పెడుతుంది.
దీంతో పాటు కరోనా వైరస్ విషయంలో కూడా సీఎం పలు సంచలన వ్యాఖ్యలు చేశారు. త్వరలో కరోనా సెకండ్ వేవ్ ప్రారంభమయ్యే అవకాశం ఉందన్నారు. కరోనా పీడ ఇంకా పోలేదు.. జాగ్రత్తగా ఉండాలని ప్రజల్ని సూచించారు. రైతు వేదిక ప్రారంభోత్సవ కార్యక్రమంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్, రైతు సమన్వయ సమితి అధ్యక్షుడు పల్లా రాజేశ్వర్ రెడ్డి, మంత్రులు నిరంజన్ రెడ్డి, ఎర్రబెల్లి దయాకర్ రావు, సత్యవతి రాథోడ్, ఉమ్మడి వరంగల్ జిల్లాకు చెందిన ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు పాల్గొన్నారు.