బీజేపీతో తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కు రహస్య ఒప్పందాలు ఉన్నాయనే అనుమానాలు అందరిలో ఉన్నాయని అందుకే ఆయన ఫెడరల్ ఫ్రంట్ లో ఎవరూ చేరక పోవచ్చని చంద్రబాబు అభిప్రాయపడ్డారు. ఎకనామిక్ టైమ్స్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ ప్రధాని మోదీకి అనుకూలంగా ప్రాంతీయ పార్టీలను అయోమయంలో పడేసేందుకు ఫెడరల్ ఫ్రంట్ పేరుతో కేసీఆర్ ప్రయత్నిస్తున్నారని చెప్పారు. బీజేపీకి వ్యతిరేకంగా పని చేసే కూటమిలో కేసీఆర్ తో పాటు పని చేసేందుకు తనకు ఎలాంటి అభ్యంతరం లేదని ఆయన చెప్పారు. అయితే బీజేపీ వ్యతిరేక కాంగ్రెస్ ఫ్రంట్ లో చేరాలని కేసీఆర్ ని తాను కోరానని దానికి ఆయన తిరస్కరించారని అన్నారు. జాతీయ స్థాయిలో బీజేపీ, కాంగ్రెసేతర కూటమిని ఏర్పాటు చేయడం కష్టమనే విషయం కేసీఆర్ కు కూడా తెలుసని అయితే శివసేన, అకాళీదళ్, నితీష్ కుమార్ పార్టీలు కాంగ్రెస్ ఫ్రంట్ లో చేరవని మిగిలిన పార్టీలు చేరే అవకాశం ఉందని చెప్పారు. ప్రస్తుతం తటస్థంగా ఉన్న ఒడిశా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ బీజేపీ వ్యతిరేక ఫ్రంట్ లో చేరే అవకాశం ఉందని తెలిపారు. మాయావతి, అఖిలేష్ యాదవ్ లు బీజేపీని వ్యతిరేకిస్తున్నారని చెప్పారు.