ఎలా అయినా గెలిచి తీరతామనే నమ్మకంతో ఉన్న ముఖ్యమంత్రి కేసీఆర్ ముందస్తు ఎన్నికలకోసం ప్రభుత్వానిని రద్దు చేసి ఎన్నికలకి సిద్దం అవుతున్న సంగతి తెలిసిందే. అయితే టికెట్ రాని వారు బహిరంగా విమర్శలు చేసి మరీ పార్టీలు మారుతున్నారు. ఈ తరుణంలో టీఆర్ఎస్ శ్రేణులకు ఒక షాక్ ఇచ్చారు కేసీఆర్ సొంత నియోజకవర్గ నేతలు. ప్రస్తుతం ఎమ్మెల్యేగా కేసీఆర్ ప్రాతినిధ్యం వహిస్తున్న గజ్వేల్ లో పార్టీకి ఎదురుదెబ్బ తగిలింది.
టీఆర్ఎస్ కు చెందిన నేతలు, వారి అనుచరులు కాంగ్రెస్ లో చేరారు. జగదేవ్ పూర్ ఎంపీపీ రేణుకతో పాటు, ఇద్దరు ఎంపీటీసీలు, ఇద్దరు సర్పంచ్ లు, ఇద్దరు కౌన్సిలర్లు కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు. రేణుకతో పాటు ఎంపీటీసీలు మమతాభాను, కవిత యాదగిరి, కౌన్సిలర్లు భాగ్యలక్ష్మి, దుర్గాప్రసాద్ లు పార్టీ మారారు. కేసీఆర్ ఫార్మ్ హౌస్ జగదేవ్ పూర్ పరిధిలోనే ఉండటం గమనార్హం. రాష్ట్ర రాజకీయాలకు కేంద్రబిందువైన ఈ ప్రాంతం నుంచి టీఆర్ఎస్ శ్రేణులు కాంగ్రెస్ లో చేరడం ఇప్పుడు చర్చనీయాంశమైంది.