Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
ఛార్ ధామ్ యాత్రలో భాగమైన కేదార్ నాథ్ యాత్రకు ప్రతికూల వాతావరణం, నిరంతరాయంగా కురుస్తున్న మంచు కారణంగా బ్రేక్ పడింది. కేదార్ నాథ్ యాత్రను తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్టు అధికారులు ప్రకటించారు. వాతావరణ పరిస్థితులు అనుకూలించేంత వరకూ యాత్రికులెవ్వరూ కేదారనాథ్ కు వెళ్లొద్దని అధికారులు హెచ్చరించారు. లించౌలి, భీంబలి ద్వారా కేదార్ నాథ్ కు వెళ్లేందుకు అనుమతి నిరాకరించారు.
కేదార్ లో మూడు అంగుళాల మేర కురుస్తున్న మంచు కారణంగా సోన్ ప్రయాగ, గౌరీకుండ్, భీమ్ బలిలో సుమారు 2,200 మంది యాత్రికులు నిలిచిపోయారు. స్థానిక హోటళ్లు, గెస్ట్ హౌసుల్లో యాత్రికులు బసచేశారు. గంగోత్రి, యమునోత్రిల్లో మంచు తీవ్రత ఇంకా ఎక్కువగా ఉంది. అక్కడ ఆరు అంగుళాల మేర మంచుకురుస్తున్నట్టు తెలుస్తోంది. అయితే కేదార్ నాథ్ లా కాకుండా…గంగోత్రి, యమునోత్రి ప్రయాణానికి ఆటంకాలు లేవని, యాత్రికులు ఎలాంటి ఇబ్బందీ పడకుండా యాత్ర కొనసాగిస్తున్నారని అర్చకులు తెలిపారు. ఉత్తరాఖండ్ లో గడచిని ఎనిమిదేళ్లలో ఇంతగా మంచుకురవడం ఇదే తొలిసారి.