ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ సంచలన ప్రకటన చేశారు. ఇక నుంచి ప్రభుత్వ కార్యాలయాల్లో రాజకీయ నేతల ఫోటోలను పెట్టమని చెప్పారు. కేవలం బీఆర్ అంబేద్కర్, భగత్ సింగ్ ఫోటోలను మాత్రమే పెడతామని చెప్పారు. సాధారణంగా గవర్నమెంట్ ఆఫీసుల్లో రాష్ట్రప్రతి, ప్రధానమంత్రులు, సీఎంల ఫోటోలు ఉంటాయని ఇక నుంచి అలా జరగదని చెప్పారు.
గణతంత్ర దినోత్సవాన్నిపురస్కరించుకుని మంగళవారం ఏర్పాటు చేసిన ఓ కార్యక్రమంలో అరవింద్ కేజ్రీవాల్ పాల్గొన్నారు. జాతీయ జెండాను కూడా ఎగురవేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బాబా సాహెబ్ అంబేద్కర్, స్వతంత్ర సమరయోధుడు భగత్ సింగ్ ఇద్దరు ఒకే లక్ష్యం కోసం వేర్వేరు మార్గాల్లో పని చేశారని అన్నారు. వారి నుంచి తానెంతో స్ఫూర్తి పొందానని చెప్పారు.
అలాగే ఇంటర్నెట్ లేని సమయంలో డాక్టర్ అంబేద్కర్ కొలంబియా విశ్వవిద్యాలయంలో చదువుకున్నారని అన్నారు. అంతేకాదు అందరికీ నాణ్యమైన విద్య అందించాలనే అంబేద్కర్ కలను నెరువేరుస్తామని కేజ్రీవాల్ చెప్పారు. ఇందులో భాగంగానే గడచిన ఏడేళ్లలో విద్యా వ్యవస్థలో అనేక సంస్కరణలు చేపట్టామని తెలిపారు. 2015లో ఆమ్ ఆద్మీ పార్టీ ఢిల్లీలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసినప్పుడు విద్య కోసం బడ్జెట్ను 25 శాతానికి పెంచిందని, ఆ తర్వాత అన్ని పాఠశాలల్లో మౌలిక సదుపాయాలను కల్పించిందని చెప్పారు.