యూజర్ల కోసం కొత్త సదుపాయాలు

యూజర్ల కోసం కొత్త సదుపాయాలు

ప్రముఖ మెసేజింగ్ యాప్ వాట్సాప్ యూజర్ల కోసం ఎప్పటికప్పుడు కొత్త సదుపాయాలు తీసుకొస్తూనే ఉంటుంది. ఇదే క్రమంలో పేమెంట్స్ సర్వీస్‌ను గతంలోనే ప్రవేశపెట్టింది. గత సంవత్సరం చాట్ బార్‌లోనే ప్రత్యేకంగా పేమెంట్స్ బటన్‌ను పొందుపరిచింది. దీనివల్ల చాట్ ద్వారానే డబ్బు పంపే ఫీచర్‌ను ఇచ్చింది. తాజాగా పేమెంట్స్ కోసం మరో ఫీచర్ తీసుకొచ్చింది వాట్సాప్. దీంతో గూగుల్ పే, పేటీఎం, ఫోన్‌పే, అమెజాన్ పే లాంటి యాప్‌లకు వాట్సాప్ పేమెంట్స్ గట్టి పోటీని ఇచ్చేలా కనిపిస్తోంది.

భారత యూజర్ల కోసం తాజాగా పేమెంట్స్‌ లో క్యూఆర్ కోడ్ స్కానర్‌ ఫీచర్‌ను తీసుకొచ్చింది వాట్సాప్. ఈ ఫీచర్‌ను ఉపయోగించి ఏదైనా స్టోర్‌లో, షాపుల్లో లేదా ఎక్కడైనా క్యూఆర్ కోడ్ స్కాన్ చేసి డబ్బు చెల్లించవచ్చు. అలాగే యూపీఐ ఐడీ కానీ, ఫోన్ నంబర్ కానీ టైప్ చేయకుండానే క్యూఆర్ కోడ్ స్కాన్ చేసి ఎవరికైనా డబ్బు పంపించవచ్చు. గూగుల్ పే, ఫోన్ పే, అమెజాన్ పే లాంటి దాదాపు అన్ని పేమెంట్స్ యాప్స్‌లో ఈ ఫీచర్ ఉంది. ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న ఈ ఫీచర్‌ను వాట్సాప్.. భారత యూజర్లకు అందుబాటులోకి తెచ్చింది. దీంతో మిగిలిన పేమెంట్ యాప్స్‌కు వాట్సాప్‌ పోటీగా నిలువనుంది.

పేమెంట్స్‌లో క్యూఆర్ స్కోర్ స్కాన్ ఆప్షన్‌ను ఆండ్రాయిడ్, ఐఓఎస్ యూజర్లందరికీ అందుబాటులోకి తెచ్చింది వాట్సాప్. వాట్సాప్ పేమెంట్ సర్వీస్‌కు మీరు యూపీఐ ఐడీని లింక్ చేసి ఉంటేనే ఈ ఫీచర్ పని చేస్తుందని గుర్తుంచుకోవాలి. అంటే బ్యాంకు అకౌంట్‌ను వాట్సాప్‌ పేమెంట్స్‌కు లింక్ చేయాలన్న మాట. క్యూఆర్ కోడ్ ఫీచర్‌ను ఎలా ఉపయోగించాలంటే..కెమెరా ఐకాన్‌పై కానీ మెనూలోని పేమెంట్ సెక్షన్‌లో స్కాన్ పేమెంట్ క్యూఆర్ కోడ్ అనే ఆప్షన్‌పై కానీ క్లిక్ చేయాలి.

బ్యాక్ కెమెరాతో మీరు పేమెంట్ చేయాలనుకున్న క్యూఆర్ కోడ్‌ను స్కాన్ చేయాలి.స్కాన్ పూర్తయ్యాక దానికి సంబంధించిన యూపీఐ ఐడీ, పేరు స్క్రీన్‌పై పాప్‌అప్ మెసేజ్‌లా కనిపిస్తుంది. వివరాలు అన్నీ కరెక్ట్ అయితే కంటిన్యూపై క్లిక్ చేయాలి.ఆ తర్వాత ఎంత మొత్తం చెల్లించాలనుకుంటున్నారో దాన్ని టైప్ చేయాలి. తర్వాత పే బటన్‌పై ట్యాప్ చేయాలి.ఇక చివరగా యూపీఐ పిన్ ఎంటర్ చేసి.. సబ్మిట్ బటన్‌పై క్లిక్ చేస్తే పేమెంట్ పూర్తవుతుంది.