Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
కృష్ణా జిల్లాలో ప్రజాసంకల్ప యాత్ర నిర్వహిస్తోన్న వైసీపీ అధినేత జగన్… ఎన్టీఆర్ స్వగ్రామం నిమ్మకూరులో పర్యటించిన సందర్భంగా కీలక ప్రకటన చేసిన సంగతి తెలిసిందే. వైసీపీ అధికారంలోకి వచ్చిన వెంటనే కృష్ణాజిల్లాను నందమూరి తారకరామారావు జిల్లాగా మారుస్తామని జగన్ చేసిన ప్రకటన రాజకీయాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఎన్టీఆర్ అభిమానులను వైసీపీవైపు ఆకర్షించడమే జగన్ ప్రకటన వెనక ఉద్దేశమయినప్పటికీ… జనంలోకి ఈ అంశం బాగా చొచ్చుకుపోయింది. కొందరు వైసీపీ నిర్ణయాన్ని హర్షిస్తుండగా… మరికొందరు మాత్రం… ఎన్టీఆర్ పేరు చెప్పి ఓట్లు రాబట్టుకోవాలన్నదే జగన్ ఆలోచన అని విమర్శిస్తున్నారు. ముఖ్యంగా టీడీపీ నేతలు జగన్ పై విరుచుకుపడుతున్నారు.
ఎన్టీఆర్ పేరును ఉచ్చరించే నైతిక హక్కు కూడా జగన్ కు లేదని టీడీపీ ఎంపీ కేశినేని నాని మండిపడ్డారు. నీతి, నిజాయితీలతో పార్టీని నడిపిన ఘనత ఎన్టీఆర్ ది అయితే… అవినీతి పునాదుల మీద పుట్టిన పార్టీ వైసీపీ అని ఆయన ఎద్దేవాచేశారు. అవినీతిపరుడైన జగన్ కు ఎన్టీఆర్ పేరు పలికే హక్కులేదని అన్నారు. పాదయాత్రే కాదు… పొర్లుయాత్ర చేసినా జగన్ కు ప్రజాదరణ రాదని, జగన్ యాత్రకు జనాలు రాకపోయినా సొంత చానల్ సాక్షి ద్వారా వందలమందిని లక్షమందిలా చూపిస్తున్నారని విమర్శించారు. నారా లోకేశ్ పై విమర్శలు చేసిన నందమూరి వెంకటేశ్వరరావు తనకు కూడా తెలుసని, ఆయన కొడాలి నాని వెనక ఉండే వైసీసీ కార్యకర్తని, పొలిటికల్ మైలేజీ కోసమే ఆయన లోకేశ్ పై విమర్శలు చేశారని కేశినేని ఆగ్రహం వ్యక్తంచేశారు.
అటు జగన్ నిర్ణయంపై ఎన్టీఆర్ సతీమణి లక్ష్మీపార్వతి హర్షం వ్యక్తంచేశారు. తన అల్లుడు చంద్రబాబు, కొడుకు బాలకృష్ణ చేయలేని పనిని జగన్ చేస్తాననడం పట్టలేని సంతోషం కలిగించిందన్నారు. ప్రజా సంకల్పయాత్రలో భాగంగా జగన్ నిమ్మకూరులో ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు. కృష్ణా జిల్లాకు ఎన్టీఆర్ పేరు పెడతానని జగన్ చెప్పగానే… స్థానికులు, ఎన్టీఆర్ అభిమానుల నుంచి హర్షాతిరేకాలు వ్యక్తమయ్యాయి. నిమ్మకూరులో నీరు-చెట్టు కింద తవ్విన చెరువును పరిశీలించిన జగన్ నీరు-చెట్టు పథకం పేరుతో తెలుగు తమ్ముళ్లు దోచుకుంటున్నారని ఆరోపించారు. నీరు-చెట్టు దోపిడీ గురించి నందమూరి కుటుంబ సభ్యులు, బంధువుల నుంచే తనకు ఫిర్యాదులు వచ్చాయని తెలిపారు.