లక్ష్మీస్ వీర గ్రంధంలో ఆమె బయోపిక్ ?

kethireddy jagadishwar reddy announced Lakshmi Parvathi biopic

Posted [relativedate] at [relativetime time_format=”H:i”] 
ఎన్టీఆర్ మీద ఇష్టంతో 10 సంవత్సరాల తర్వాత మళ్లీ దర్శకత్వం వహిస్తున్నానంటూ కేతిరెడ్డి జగదీశ్వర్ రెడ్డి ఘనంగా లక్ష్మీస్ వీర గ్రంథం ప్రకటించారు. కానీ ఆయన ఏమి చెప్పినా ఆ సినిమా టైటిల్, పోస్టర్ అందులో కంటెంట్ ఎలా వుండబోతుందో చెప్పకనే చెప్పాయి. ఎన్టీఆర్ పేరు చెప్పుకున్నా నిజానికి అది లక్ష్మీపార్వతి జీవితం చుట్టూ తిరిగే కథ అట. టైటిల్ లో వీరగ్రంధం అన్న మాట విన్న ఎవరికైనా లక్ష్మీపార్వతి మాజీ భర్త వీరగంధం సుబ్బారావు గుర్తుకు వస్తాడు. హరికథలు చెప్పడంలో దిట్ట అయిన సుబ్బారావు తో లక్ష్మీపార్వతి పెళ్ళికి గుర్తుగా కోటేశ్వరప్రసాద్ అనే ఓ కొడుకు కూడా వున్నాడు. ఆయనతో విడాకులు తీసుకున్న లక్ష్మీపార్వతి ఎన్టీఆర్ తో వైవాహిక జీవితంలోకి అడుగు పెట్టారు. వారి పెళ్లితో టీడీపీ లో, ఎన్టీఆర్ కుటుంబంలో పెద్ద సంక్షోభం వచ్చిపడింది. ఆ పరిణామాలు ఏమిటి అనేది అందరికీ తెలిసిందే.

అయితే వీరగంధం సుబ్బారావు ని చేసుకున్నప్పుడు లక్ష్మీపార్వతి ఏమి చేసేవారు ? ఆమె ఏమి చదువుకున్నారు ? ఏ వృత్తిలో ఉండేవారు ? ఎందుకు విడాకులు తీసుకోవాల్సి వచ్చింది ? ఇలాంటి అంశాల మీద లక్ష్మీస్ వీరగ్రంధంలో దృష్ఠి పెట్టే అవకాశం వుంది. నిజానికి బతికి వున్న వ్యక్తుల జీవితాల గురించి సినిమా తీసేటప్పుడు వారి అనుమతి తీసుకోవడం ఆనవాయితీ. ఇప్పుడు ఈ సినిమా దర్శకనిర్మాతలు కూడా అదే పని చేయాలి. కానీ రామ్ గోపాల్ వర్మ లాగా వీళ్ళు లక్ష్మీపార్వతి అనుమతి కోరిన దాఖలాలు లేవు. ఒకవేళ లక్ష్మీపార్వతి కోర్టుకి వెళితే ఈ సినిమా ఆగిపోయే అవకాశం కూడా లేకపోలేదు. ఇలాంటి సినిమా విషయాలు కాస్త లోతుగా తెలిసిన ఓ పెద్దాయన అసలు లక్ష్మీస్ ఎన్టీఆర్, లక్ష్మీస్ వీరగ్రంధం సినిమాలు షూటింగ్ జరుపుకునే ఛాన్స్ లేదు అంటున్నారు. మొదటి సినిమాలో చంద్రబాబుని టార్గెట్ చేద్దామనుకుంటే, దాన్ని కౌంటర్ చేస్తూ లక్ష్మీపార్వతిని ఎటాక్ చేయడానికి రెండో సినిమా ప్రకటన వచ్చింది. ఈ నేపథ్యంలో తమ వ్యక్తిత్వాలు దెబ్బ తినకుండా రెండు వర్గాలు లోపాయికారీ ఒప్పందంతో ఎన్టీఆర్ సినిమా మీద చేతులు ఎత్తేయవచ్చట. అదే జరిగితే ఎన్టీఆర్ బయోపిక్ తో సోలో ఎన్టీఆర్ గా బాలయ్య మాత్రమే బరిలో ఉంటాడు.