అభయ్‌రామ్‌ వార్తలు పుకార్లే…

Rumours of Abhay Ram acts in NTR and Trivikram movie

Posted [relativedate] at [relativetime time_format=”H:i”] 
ఎన్టీఆర్‌ ప్రస్తుతం త్రివిక్రమ్‌ దర్శకత్వంలో ఒక సినిమా చేసేందుకు రెడీ అవుతున్నాడు. ఇటీవలే ఆ సినిమాకు సంబంధించిన పూజా కార్యక్రమాలు జరిగాయి. మొదటి షాట్‌కు పవన్‌ కళ్యాణ్‌ క్లాప్‌ కొట్టిన విషయం తెల్సిందే. వచ్చే సంవత్సరంలో రెగ్యులర్‌ షూటింగ్‌ ప్రారంభం కాబోతుంది. ఈ చిత్రం షూటింగ్‌ ప్రారంభోత్సవంలో పవన్‌ కళ్యాణ్‌తో పాటు హాజరు అయిన ఎన్టీఆర్‌ భార్య, కొడుకు లక్ష్మీ ప్రణతి మరియు అభయ్‌ రామ్‌లు ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. ఎన్టీఆర్‌ తనయుడు అభయ్‌ అక్కడ కొద్ది సమయం సందడి చేశాడు. ఈ సమయంలోనే అక్కడ మీడియా వారికి చిత్ర యూనిట్‌ సభ్యుల నుండి ఈ చిత్రంలో అభయ్‌ కూడా చిన్న గెస్ట్‌ రోల్‌ పోషిస్తున్నాడు అంటూ వార్త వినిపించింది.

చిన్న క్లూ దొరికితే మీడియా వారు ఊరుకుంటారా… గత రెండు మూడు రోజులుగా సోషల్‌ మీడియాతో పాటు అన్ని మీడియాల్లో కూడా ఎన్టీఆర్‌, త్రివిక్రమ్‌ కాంబో మూవీలో అభయ్‌ రామ్‌ నటిస్తున్నాడు అంటూ వార్తలు కుప్పలు తెప్పలుగా వచ్చాయి. ఇటీవలే రవితేజ తనయుడు ‘రాజా ది గ్రేట్‌’ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. అలాగే ఈ ఎన్టీఆర్‌ తనయుడు కూడా ఎంట్రీ ఇవ్వబోతున్న నేపథ్యంలో సినీ వర్గాల వారు మరియు ప్రేక్షకులు ఆనందాన్ని వ్యక్తం చేశారు. కాని ఆ వార్తలు పుకార్లే అని తేలిపోయింది.

తాజాగా చిత్ర నిర్మాణ సంస్థకు చెందిన కొందరు మీడియాలో వస్తున్న వార్తలపై క్లారిటీ ఇచ్చారు. అభయ్‌ రామ్‌ ఈ చిత్రంలో నటిస్తున్నట్లుగా వస్తున్న వార్తలు పుకార్లే అని, ఎన్టీఆర్‌ సినిమా పూజా కార్యక్రమాలు అవ్వడంతో లక్ష్మీ ప్రణతి వెంట అభయ్‌ వచ్చారు అని, అంతకు మించి మరేం లేదని చెబుతున్నారు. ఎన్టీఆర్‌ తనయుడిని ఇప్పట్లో సినిమాల్లో నటింపజేసే ఆలోచన లేదు అంటూ కూడా వారు క్లారిటీ ఇచ్చారు. ఎన్టీఆర్‌ కూడా గతంలో ఒకానొక సమయంలో తన కొడుకు సినిమాల్లోకి రావడం అనేది అతడి ఇష్టం అని, తాను మాత్రం ఎలాంటి నిర్ణయం తీసుకోను అంటూ చెప్పుకొచ్చాడు. అంటే అతడికి ఆసక్తి ఉండి సినిమాల్లోకి వస్తాను అన్నప్పుడు తీసుకు వస్తాను అని ఎన్టీఆర్‌ అభిప్రాయం. అయినా అభయ్‌ రామ్‌ ఇంకా చాలా చిన్నపిల్లాడు అప్పుడే సినిమాల్లోకి వచ్చేంత వయస్సు కూడా రాలేదు.