మహిళల రక్షణకు ఎన్నెన్ని చట్టాలు చేసినా అవి అధికారం, డబ్బు ఉన్నవాడికి చుట్టలుగా మారుతూనే ఉన్నాయి. అబల పై పల్లె, పట్టణం అనే తేడా లేకుండా అఘాయిత్యాలు సాగుతున్నాయి. సాక్షాత్తూ దేశరాజధానిలోని ఓ కాల్ సెంటర్లో మదమెక్కిన ఓ పోలీసు అధికారి కొడుకు ఓ యువతి పై పాశవికంగా దాడి చేశాడు. వీపుపై గుద్ది, కాలితో తన్ని హింసించాడు. కొట్టరాని చోట కొట్టొద్దు అని బతిమాలుతున్నా పట్టించుకోలేదు అత్యంత క్రూరంగా వ్యవహరించాడు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. అంతేకాకుండా ఈ వీడియోను తన మాజీ గర్ల్‌ఫ్రెండ్‌కు పంపి, నన్ను కాదంటే నీకూ ఇదే గతి పడుతుందని హెచ్చరించాడు.
మేకప్ ఆర్టిస్టుగా పనిచేస్తున్న 22 ఏళ్ల జ్యోతి, ఢిల్లీ నార్కోటిక్స్ ఏఎస్ఐ అశోక్ సింగ్ తోమర్ కొడుకు రోహిత్ తోమర్ ఏడాదిన్నర కాలం ప్రేమించుకున్నారు. పెళ్లి కూడా చేసుకోవాలనుకున్నారు. అయితే జ్యోతి తండ్రికి రోహిత్ ప్రవర్తనపై అనుమానం వచ్చింది. రోహిత్ ఇంటిచుట్టుపక్కల వారిని, బంధువులును వాకబు చేశారు. రోహిత్ తాగుబోతు, తిరుగుబోతు, డ్రగ్స్ బానిస, ఉన్మాది అని తేలింది. పైగా ఉద్యోగం కూడా లేదు. జ్యోతికి అబద్ధాలు చెప్పి కవర్ చేసినట్లు తేలింది. దీంతో జ్యోతి పెళ్లికి నిరాకరించింది. జీర్ణించుకోలేని రోహిత్ ఆమెను చంపుతానని బెదిరింపులకు దిగాడు. గొడ్డలితో నరికేస్తానని, యాసిడ్ దాడి చేస్తానని, తను పోలీసు కొడుకును కనుక ఎవరూ ఏమీ చేయలేరని ఆమెను బెదిరించాడు. దీంతో జ్యోతి పోలీసులకు ఫిర్యాదు చేసింది అయినా రోహిత్ వెనక్కి తగ్గలేదు. ‘నువ్వు నన్ను కాదంటే.. ఈ వీడియోలోని అమ్మాయిని తన్నినట్లు తంతా అని 15 రోజుల కిందట ఓ వీడియో పంపాడు. ఆ వీడియో జ్యోతి ప్రస్తావన కూడా వచ్చింది. దీంతో జ్యోతి మళ్లీ పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో వారు తప్పనిసరి అన్నట్లు అతణ్ని ముందస్తు కస్టడీలోకి తీసుకున్నారు. అయినా రోహిత్ బెదిరింపులు ఆగలేదు. తనను ఎవరూ ఏమీ చేయలేరని జ్యోతిని ఫోన్లో బెదిరించాడు. ఆమె మళ్లీ పోలీసులకు ఫిర్యాదు చేసింది. అయితే రక్షక భటులు అప్పటికే ఒత్తిళ్లతో రోహిత్‌ను వదిలేశారు. రోహిత్ తండ్రి కూడా జ్యోతి కుటుంబాన్ని బెదిరించాడు. కాల్ సెంటర్లో రోహిత్ దాడి దృశ్యాన్ని అతని స్నేహితుడైన బీపీఓ ఉద్యోగి అలీ హసన్ వీడియో తీశాడు. దాడికి గురైన యువతి ఇటీవలే రోహిత్‌కు పరిచయమైనట్లు తెలుస్తోంది.