Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
హర్యానా, పంజాబ్ రాష్ట్రాల్లో ఖాప్ పంచాయితీలకు ఎంత పలుకుబడి ఉంటుందో ప్రత్యేకంగా చెప్పనక్కరలేదు. ఖాప్ పంచాయితీలు ఇచ్చే తీర్పులు దేశవ్యాప్తంగా ఎన్నోసార్లు తీవ్ర చర్చనీయాంశమై విమర్శలకు గురయ్యాయి. దీనిపై స్పందించిన దేశ అత్యున్నత న్యాయస్థానం పంచాయితీల పెద్దలు ఇచ్చే తీర్పులు చెల్లవని ఇటీవలే తేల్చిచెప్పింది. ఈ నేపథ్యంలో పలు పంచాయితీలు తాము ఎంతోకాలంగా పాటిస్తోన్న సంప్రదాయాల విషయంలో వెనక్కు తగ్గుతున్నాయి. హర్యానాలోని అతిపెద్ద ఖాప్ పంచాయితీ మాలిక్ గథ్వాలా ఖాప్ తాజాగా ఇచ్చిన ఓ తీర్పు దీనికి నిదర్శనం. హర్యానా, పంజాబ్, పశ్చిమ బంగ వంటి ఉత్తరాది రాష్ట్రాల్లో మహిళలు మేలిముసుగు ధరించడం తప్పనిసరి. శతాబ్దాలుగా కొనసాగుతున్న ఈ సంప్రదాయంపై ఖాప్ పంచాయితీ సంచలన వ్యాఖ్యలు చేసింది. సోనెపత్ లోని ఘోఘన ప్రాంతంలో జరిగిన ఓ కార్యక్రమంలో ఖాప్ పంచాయితీ పెద్దలు మహిళలు ఇకమీదట మేలిముసుగు ధరించాల్సిన అవసరం లేదని తీర్పు ఇచ్చారు. ఏళ్లనాటి సంప్రదాయాన్ని నిషేధిస్తున్నట్టు ప్రకటించారు.
ఖాప్ పంచాయితీ చీఫ్ బల్జీత్ మాలిక్ మాట్లాడుతూ… ఏళ్ల నాటి సంప్రదాయానికి స్వస్తి పలకాల్సిన సమయం వచ్చింది. మహిళలు ఇక మీదట ఇంట్లో లేదా… బయటకు వచ్చినప్పుడు మేలిముసుగు ధరించాల్సిన అవసరం లేదు. అలా చేయడం అవివేకం. ముఖాన్ని ముసుగుతో కప్పిఉంచడం వల్ల మహిళలు చూసేందుకు ఇబ్బందిపడడంతో పాటు… శ్వాసతీసుకోవటంలోనూ సమస్యలు ఎదుర్కొంటున్నారు. అందువల్ల మేలిముసుగును నిషేధిస్తున్నాం అని సభాముఖంగా తీర్పుఇచ్చారు. పెద్ద వాళ్లను గౌరవించేందుకు సూచకంగా తలపై కేవలం స్కార్ఫ్ ధరిస్తే సరిపోతుందని తెలిపారు. ఖాప్ పంచాయితీ నిర్ణయంపై స్థానిక మహిళలు హర్షం వ్యక్తంచేశారు. నిజంగా మహిళలకు ఇప్పుడే స్వాతంత్య్రం వచ్చిందని ఆనందం వ్యక్తంచేశారు.