తెలంగాణలో కిడ్నాప్ ఘటనలు కలకలం రేపుతున్నాయి. మహబూబాబాద్ జిల్లాలో జర్నలిస్ట్ కుమారుడు దీక్షిత్ రెడ్డిని దారుణ హత్య చేశారు కిడ్నాపర్లు. ఆ ఘటన నుంచి కోలుకోకముందే ములుగు జిల్లాలో మరో కిడ్నాప్ కేసు కలకలం రేపింది. జిల్లాలోని వెంకటాపురం మండలం సీనీఫక్కీలో నాలుగు నెలల బాబు కిడ్నాప్‌కు గురయ్యాడు. దీంతో వెంటనే స్పందించిన స్థానికులు అదే తరహాలో స్థానికులు కిడ్నాపర్లను చేజ్ చేసి పట్టుకున్నారు. అనంతరం వాహనాన్ని, కిడ్నాపర్లను, బాలుడిని పోలీసులకు అప్పగించారు.
నాలుగు నెలలక్రితం నాగేశ్వరీ అనే మహిళ బాలుడిని దత్తత తీసుకుంది. అర్ధరాత్రి 8 మంది వచ్చి తిరుమల నాగేశ్వరి అనే ఆమె ఇంట్లోకి చొరబడి కళ్లలో కారం కొట్టారు. ఆ తర్వాత బాబుని తీసుకొని వాహనంలో పరారయ్యాడు. అయితే ఈ క్రమంలో సూరవీడు గ్రామస్తులు వెంకటాపురం పోలీసులకు సమాచారం ఇవ్వడంతో యోగితా నగర్ గ్రామం వద్ద వాహనాన్ని పట్టుకుని వారిని పోలీస్ స్టేషన్ కు తరలించారు.
అయితే దత్తత ఇచ్చినవారే కిడ్నాప్‌కు పాల్పడి ఉంటారని పోలీసులకు బాధితురాలి ఫిర్యాదు చేసింది. ప్రేమ పెళ్లి చేసుకుని ఇంట్లో వారు కాదనడంతో 7నెలల గర్భిణిగా నాగేశ్వరిని స్నేహ-మహేందర్ దంపతులు ఆశ్రయించారు. కాన్పు చేసిన నాగేశ్వరీ బాలుడిని తల్లిదండ్రులు వద్దన్నారు. దీంతో పుట్టిన బిడ్డను నాగేశ్వరీయే దత్తత తీసుకుంది. ఈక్రమంలో గత అర్ధరాత్రి తనపై దాడి చేసి, కళ్లలో కారం చల్లిన దుండగులు బాలుడిని ఎత్తుకెళ్లినట్లు బాధితురాలు నాగేశ్వరి పోలీసులకు తెలిపారు. దీనిపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు.